11-09-2024 01:36:05 AM
అట్టడుగు వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట
ఆగ్రా సదస్సులో రాష్ట్రమంత్రి సీతక్క
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయ క్రాంతి): పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ నిధులను పెంచాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. పదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, వితంతుల నెలవారీ పింఛన్ మొత్తాన్ని పెంచలేదని గుర్తుచేశారు. కేంద్రప్రభుత్వం వృద్ధులు, వితంతులకు నెలకు రూ.200, దివ్యాంగులకు రూ.300 ఇవ్వడం ద్వారా పథకం లక్ష్యం నెరవేరడం లేదన్నారు.
యూపీలోని ఆగ్రాలో రెండు రోజులపాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక న్యాయం, సాధికారత సదస్సులో మంత్రి సీతక్క మంగళవారం ప్రసంగించారు. పేదలు, అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమం కోసం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన ద్వారం గతంలో బిడ్డ జన్మనిచ్చిన మహిళలకు కేంద్రం రూ. 6 వేల ఆర్థిక సాయం చేసేదని, ప్రస్తుతం ఒకే కాన్పుకు పరిమితం చేయడం ద్వారా అనేకమంది పేదలు నష్టపోతున్నారన్నారు. తల్లి, పిల్లలకు పోషకాహారం లోపిస్తుందన్నారు. పేదలకు ప్రయోజనం కలిగేలా కనీసం రెండో కాన్పు వరకైనా ఈ స్కీమును వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.
కొత్తగా ఆహార భద్రత కార్డుల ఎంపిక కోసం ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ పెట్టే స్కీమును ప్రారంభిస్తే వారిలో పోషకాహార లోపం తగ్గుతుం దన్నారు. పీఎం ఆవాజ్ యోజన కింద ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.5 లక్షలకు పెంచాలని కోరారు. అత్యాచారాలకు, లైంగిక దాడులకు గురవుతున్న వారిలో అత్యధికులు దళితులే ఉన్నారని, అందుకే బాధితులకు సత్వర న్యాయం అందేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క సూచించారు.
అడవుల్లో నివసించే ఆదివాసీల కోసం కొత్త విద్యుత్ లైన్, రోడ్డు, మంచి నీటి పైపులు వేయాలంటే అటవీ శాఖ ఎన్నో అభ్యంతరాలు పెడుతుందని, మైనింగ్.. ఇతర కార్యకలాపాలకు లేని ఈ ప్రాంతాల్లో ఇన్ని అవాంతరాలు ఎందుకని ప్రశ్నించారు. ములుగులో కేవలం రూ.5 లక్షలతో నిర్మించిన కంటెయినర్ ఆసుపత్రి ఆదివాసీలకు ఎంతో ఉపయోగపడుతుందని, అందుకే ఈ ఆస్పత్రుల నిర్మాణాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు.
సీతక్కకు అభినందనలు..
సదస్సుకు అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి వీరేంద్రకుమార్‌ను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించారు. ఇలాంటి సదస్సులను నిర్వహించడం ద్వారా అట్టడుగు వర్గాల ఆకాంక్షలను తెలుసుకోవడంతో పాటు వారి ఆత్మవిశ్వాసం పెంచిన వారమవుతామని సీతక్క పేర్కొన్నారు. సీతక్క ప్రసంగాన్ని కేంద్ర, పలు రాష్ట్రాల మంత్రులు అభినందించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు, కేంద్ర పథకాల్లో చేయాల్సిన సవరణలను చాలా సహేతుకంగా వివరించినందుకు మెచ్చుకున్నారు.