11-02-2026 12:00:00 AM
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదని తెగేసి చెప్పిన పాకిస్తాన్ మనసు మార్చుకుంది. ఐసీసీతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చర్చలు సఫలం కావడం, మిత్రులైన శ్రీలంక, బంగ్లాదేశ్ విజ్ఞప్తి మేరకు భారత్‌తో మ్యాచ్ ఆడాలనే నిర్ణయానికి వచ్చినట్లు పాక్ తెలిపింది. 2008 తర్వాత భారత్‌తో సంబంధాలు దెబ్బతినడంతో ఐసీసీ టోర్నీల్లో మాత్రమే పాక్ మనతో మ్యాచ్‌లు ఆడుతూ వస్తోంది. అయితే పాక్‌తో మ్యాచ్‌లను తటస్థ వేదికల్లోనే ఆడతామని భారత్ ఎప్పుడో తేల్చిచెప్పింది. అయితే ప్రపంచకప్‌లో భాగంగా ఈ ఆదివారం కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ తలపడాల్సి ఉంది.
కానీ ఉన్నపళంగా సరైన కారణాలు లేకుండానే భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు పాక్ పేర్కొంది. కేవలం బంగ్లాదేశ్‌కు మద్దతుగానే భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ ప్రభు త్వం తెలిపింది. కానీ ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్న ఐసీసీ.. కఠిన చర్యలతో పాటు ఆర్థికంగా మరింత నష్టపోవాల్సి వస్తుందని పీసీబీని హెచ్చరించింది. ఐసీసీ చెప్పినా వినకుండా కేవలం బంగ్లా కోసమే భారత్ తో మ్యాచ్ ఆడడం లేదంటూ పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది.
కానీ భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడం, విదేశీ జట్లు పాక్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పీసీబీ ఆదాయం దిగజారుతూ వచ్చింది. ఇప్పుడున్న స్థితిలో భారత్‌తో మ్యాచ్ ఆడకుంటే ఆర్థికంగా మరింత నష్టపోవాల్సి వస్తుందని పాకిస్థాన్‌కు అర్థమయ్యేలా బంగ్లాదేశ్, శ్రీలంక ప్రభుత్వాలు వివరించాయి. దీంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది.
కానీ బయటకు మాత్రం ఐసీసీ తమతో చర్చించిందని, మిత్ర దేశాలు కూడా భారత్‌తో మ్యాచ్ ఆడాలని విజ్ఞప్తి చేయడంతోనే ఒప్పుకున్నట్లు పాక్ ప్రధాని షెహబాజ్ పేర్కొన్నారు. తాజా చర్యలతో అంతకుముందు మేం భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదని బెదిరింపులకు దిగిన పాకిస్తాన్, ఇప్పుడు మాత్రం బంగ్లాదేశ్ పేరును సానుభూతికి వాడుకుంటూ యూటర్న్ తీసుకోవడం ద్వారా పరువు పోగొట్టుకుంది.
ఇటీవలే బంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన సంఘటనలను తమకు ఆసరాగా చేసుకొని ఆ దేశానికి దగ్గరవ్వాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. దీనికి టీ20 ప్రపంచకప్‌ను ఆయుధంగా వాడుకోవాలని పాక్ యత్నించినప్పటికీ వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఇక పీసీబీ ఛైర్మన్ మొహమ్మద్ నఖ్వీ ఒక అడుగు ముందుకేసి ‘మేం సొంత ప్రయోజనాల కోసం ఏం చేయలేదు. బంగ్లా తరఫున నిలబడ్డాం. కానీ వాళ్లు మమ్మల్ని భారత్‌తో మ్యాచ్ ఆడాలని అభ్యర్థించారు.
అందుకే ఈ నిర్ణయం’ అని ప్రకటించడం హాస్యాస్పదం. గతేడాది ఆసియా కప్ సమయంలోనూ పాక్ ఆటగాళ్లకు టీమిండియా కరచాలనం చేయలేదన్న కారణంతో నఖ్వీ మ్యాచ్ రిఫరీని తొలగించాలని డిమాండ్ చేశాడు. కానీ అది కుదరకపోవడంతో యూఏఈతో మ్యాచ్ ఆడబోమని బెదరింపులకు దిగాడు. కానీ మ్యాచ్‌కు కొన్ని నిమిషాల ముందే యూటర్న్ తీసుకోవడం ద్వారా తన ద్వంద్వ వైఖరిని బయటపెట్టాడు.
ఇదే టోర్నీలో విజేతగా నిలిచిన భారత్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికి నిరాకరించడంతో, ఆయన కప్‌ను తన వెంట తీసుకెళ్లిపోవడం అప్పట్లో వివాదాస్పదమయింది. ఎన్ని మలుపులు తిరిగినప్పటికీ చివరకు భారత్, పాక్ మ్యాచ్ జరగనుండడం అభిమానుల్లో జోష్ నింపింది.