calender_icon.png 22 February, 2026 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూలాలపై ప్రపంచీకరణ దెబ్బ!

10-02-2026 12:00:00 AM

దుప్పటి మొగిలి :

ఒకప్పుడు మనిషి తన సంస్కృతితో గుర్తించబడేవాడు. కానీ ఇప్పుడు బ్రాండ్‌తో, వినియోగంతో, ట్రెండ్‌తోనే వ్య క్తిని గుర్తించడానికి ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) ప్రధాన కారణమని చెప్పొచ్చు. ప్రపంచీకరణ అనే ప్రవాహం నేడు దేశ సరిహద్దులను చెరిపివేసి, ప్రపంచాన్ని ఒక కుగ్రామం గా మార్చేసిందనడంలో అతిశయోక్తి లేదు. సాంకేతికత పుణ్యమా అని ఖండాల మధ్య దూరాలు తగ్గిపోయాయి. అరచేతిలోనే ప్ర పంచం ఆవిష్కృతమవుతోంది.

ఆర్థిక పురోభివృద్ధి, సాంకేతిక విప్లవం, సమాచార మార్పిడిలో ఈ ప్రక్రియ అద్భుతాలు సృ ష్టించిందనడంలో సందేహం లేదు. కానీ నాణేనికి మరో పక్క భయంకరమైన సాం స్కృతిక విధ్వంసం దాగి ఉన్నది. అంగడి సరుకైన సంస్కృతిలో అలవాట్లు మారుతున్నాయి, అస్తిత్వాలు కరుగుతున్నాయి. ప్ర పంచీకరణతో మూగబోయిన భాషలు, మసకబారిన పండుగలు, మార్కెట్‌లో అ మ్ముడుపోయిన మన ఆత్మలు కనిపిస్తాయి.

ఇది అభివృద్ధి ప్రయాణమా? లేదా సాం స్కృతిక శవయాత్రనా? అనే ప్రశ్న రాకమానదు. వేగం పెరిగితే దారి చిన్నదవుతుం ది, కానీ దారి తప్పితే గమ్యం దూరమవుతుంది అనే సామెత ఈ కాలానికి అక్షరాలా సరిపోతుంది. ప్రపంచీకరణ ద్వారా స్థానిక ఆదర్శా లు, ప్రాంతీయ వీరుల గాధలు, సంస్కృతి సంప్రదాయ విలువలు ప్రాధాన్యత కోల్పోతున్నాయి.

ప్రాభవం కోల్పోతున్నామా?

వసుధైక కుటుంబం అన్న నినాదంతో మొదలైన ఈ ప్రయాణం క్రమంగా స్థానిక సంస్కృతులపై మరణశాసనం రాసే దిశ గా సాగుతుండటం ఆందోళనకరం. ‘అంగడిలో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్నట్లు, ప్రపంచ మార్కెట్లో మనకు అన్ని దేశాల వస్తువులు, సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి కానీ మన సొంత గుర్తిం పు మాత్రం ప్రమాదంలో పడింది.

గ్లోబలైజేషన్ తెచ్చిన పాప్ కల్చర్ ధాటికి శతాబ్దా ల చరిత్ర కలిగిన ప్రపంచంలోని అనేక సంస్కృతి, జానపద కళలు, మాతృభాషలు, ఆచార వ్యవహారాలు ‘అడవి కాచిన వెన్నెల వలే’ నిశ్శబ్దంగా అంతరించిపోతున్నాయి. ప్రపంచీకరణ అనేది అన్ని సం స్కృతుల సమ్మేళనం.. కానీ ఇప్పుడు జరుగుతున్నది  సమతుల్యత లేని సమ్మిశ్రణం. ఆచరణలో ఇది పాశ్చాత్యీకరణగానే మిగిలిపోయింది.

బలమైన పాశ్చాత్య సంస్కృ తి, బలహీనమైన స్థానిక కళలను, భాషలను మింగేస్తోంది. బహుళజాతి కంపెనీల రాకతో వినియోగదారుడికి ఎంపిక పెరిగింది. స్థానిక వృత్తులు, కుటీర పరిశ్రమలు కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నాయి. గ్లోబల్ బ్రాండ్ల హోరులో మన  చేనేత వస్త్రాలు, మట్టి పాత్రలు, దేశీయ ఉత్పత్తు లు కనుమరుగవుతున్నాయి. జానపద కళాకారులు అనాథలవుతున్నారు. శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల భాష, ఆహారం, వేషధారణలే ఆధునికతకు కొలమానాలుగా మారుతున్నాయి. కళలు, హస్తకళలు ప్రపంచీకరణ పోటీలో తట్టుకోలేకపోతున్నాయి.  

మారుతున్న అలవాట్లు..

ఒకే మట్టి మీద వేరు వేరు పూలు పూస్తే నే తోట అందంగా కనిపిస్తుంది. కానీ గ్లోబలైజేషన్ ఆ తోటను ఒకే రకమైన పూల తోటగా మార్చేస్తూ ప్రమాదంలోకి నెట్టేస్తుంది. నేడు టోక్యో, ఢిల్లీ, న్యూయార్క్, లండన్, హైదరాబాద్ ఇలా నగరాలు ఏవై నా ఒక రకమైన సంస్కృతి, సంప్రదాయా లు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క ప్రాంత శీతోష్ణస్థితి పండించే పంటల అనుగుణంగా ఆహారపు అలవాట్లు ఉండేవి. కానీ ఆహార సంస్కృతి కూడా ప్రపంచీకరణకు బలవుతూ వస్తున్నది.

ప్రతి దేశంలో తమకం టూ ప్రత్యేకమైన వంటకాలు, ఆహారపు సంప్రదాయ అలవాట్లు ఉండేవి. కానీ నేడు ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి ప్రపంచమంతా వ్యాపించి సంప్రదాయ వంటకాలను పక్క కు నెట్టేస్తోంది. ఇది కేవలం రుచుల మా ర్పు మాత్రమే కాదు. ఆరోగ్యం, వ్యవసా యం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది.

ఒకప్పుడు పం డుగ అంటే గ్రామాలు, పట్టణాల్లో సందడి నెలకొనేది. కానీ ప్రపంచీకరణ పుణ్యమా అని ఇప్పుడు పండుగలన్నీ మార్కెటింగ్ క్యాలెండర్‌లోని తేదీలయ్యాయి. బట్టలు, ఇతర రకాల వ్యాపారాలు చేసే వ్యాపారవేత్తలు రకరకాల ఆఫర్లు పెట్టి ప్రజలను దోచుకునే పనికి తెరలేపుతున్నారు. 

భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి!

ప్రపంచీకరణ యువతకు ప్రపంచాన్ని చూసే కళ్లను ఇచ్చింది, ఉద్యోగావకాశాల ను పెంచింది. కానీ అదే సమయంలో స్థా నిక చరిత్ర, భాషా విలువలపై నిర్లక్ష్యాన్ని కూడా పెంచేసింది. గ్లోబల్ మార్కెట్‌కు భాష అవసరం లేదు. దీనికి వినియోగదారుడు మాత్రమే కావాలి తప్ప సంస్కృతి తో పని ఉండదు. కొనుగోలుదారుడే ప్రా మాణికం కావడం, దీనికి గ్లోబల్ భాష అయిన ఆంగ్లం తోడవ్వడం మన స్థానిక భాషలను చంపేస్తున్నాయి.

స్థానిక భాషకు ఇబ్బందులు కలుగుతుండడంతో దానికి సంబంధించిన సాహిత్యం, ఆలోచనా విధానం కనుమరుగవుతాయి. కేవలం భాషానష్టం మాత్రమే కాదు మానవ మేధ స్సు వైవిధ్యానికి కూడా ప్రమాదమే. యునెస్కో అంచనాల ప్రకారం ప్రతి రెం డు వారాలకు ఒక భాష భూమి మీద నుం చి అంతరించిపోతోందట. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు సంప్రదాయ భాషకు మరణం అని చెప్పవచ్చు. గ్లోబలైజేషన్ తెచ్చిన మిరుమిట్లు గొలిపే మార్పు లు మెరుగులకు పోయి అసలు అస్థిత్వాన్ని కోల్పోతున్నాయి.

కార్పొరేట్ శక్తులు మన సంస్కృతిని మార్కెట్ సరుకుగా మార్చి లాభాలు గడిస్తుంటే మనం మూలాలను కోల్పోవాల్సి వస్తున్నది. స్థానిక సంస్కృతుల పరిరక్షణ ప్రభుత్వాల పని మాత్రమే కాదు. అది సమాజం బాధ్యత. పాఠశాల ల్లో గ్లోబల్ స్కిల్స్‌తో పాటు స్థానిక జ్ఞానం నేర్పించాలి. దేశ మీడియా కూడా స్థానిక కళలను ప్రోత్సహించాల్సిన అవసరముం ది. మనం ఆధునికతను ఆహ్వానించాలి కానీ అది మన అస్తిత్వాన్ని బలి తీసుకునేదిగా ఉండకూడదు.

ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకునే వ్యామోహంలో మాతృభాష మూలాలను నరికేసుకుంటున్నాం. మాతృ భాషకు విద్యాబోధనలో, దైనందిన జీవితంలో ప్రాధాన్యత ఇవ్వాలి. లోకల్ ఫర్ వోకల్ నినాదాన్ని నిజం చేయాలి. మన కళలు, ఆచారాలు, సంప్రదాయాలను తర్వాతి తరానికి అందించడం మన కనీస బాధ్యత.

ప్రపంచంతో పోటీ..

ప్రపంచీకరణ ఎంతమాత్రం తప్పు కాదు. కానీ దాన్ని ఎలా నిర్వహిస్తున్నామ న్న దానిలోనే అసలు అర్థం దాగి ఉంది. గ్లోబల్ ప్రభావాలను అంగీకరిస్తూనే, స్థాని క సంస్కృతులను పరిరక్షించే సమతుల్యత అవసరం. సాంకేతికత నేర్చుకోవాలి కానీ సంస్కృతిని తాకట్టు పెట్టకుడదు. అభివృద్ధి కావాలి కానీ ఆత్మహత్య చేసుకోకూడదు! మన భూమి, భాష, సంస్కృతి మనల్ని నిలబెట్టిన మూలాలు. ప్రతి దేశం, ప్రతి సమాజం తన సాంస్కృతిక మూలాలను విద్య, మీడియా, విధానాల ద్వారా కాపాడుకోవాలి.

స్థానిక భాషలకు ప్రాధాన్యత, సంప్రదాయ కళలకు ప్రోత్సాహం, పండుగల ఆత్మను కాపాడే ప్రయత్నాలు అవస రం. గ్లోబల్ మార్కెట్‌లో నిలబడాలంటే, మన ప్రత్యేకతే మన బలం అన్న అవగాహన పెరగాలి. ప్రపంచీకరణ ఒక సాధనం మాత్రమే. సంస్కృతి అనేది ఒక జాతికి వెన్నెముక వంటిది. అలా అని ఆధునికతను మనం అడ్డుకోలేం. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ప్రపంచీకరణలో ముందున్నా తమ భాషను, సంస్కృతిని ప్రాణం కంటే మిన్నగా కాపాడుకుంటున్నా యి. మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలి.

ప్రపంచీకరణలో భాగంగా ప్ర పంచ పౌరులుగా ఎదగడం తప్పు కాదు, కానీ మన మూలాలను మరవడం అంటే మనల్ని మనం సమాధి చేసుకోవడమే. స్థానిక సంస్కృతులు మరణశాసనం కా కూడదు, అవి ఆధునికతతో జతకట్టి కొత్త జీవన వేదం కావాలి. మన మూలాలను గౌరవిస్తూనే, ప్రపంచంతో పోటీ పడటమే నేటి తక్షణ కర్తవ్యం. లేనిపక్షంలో రేపటి తరం తన చరిత్రను గూగుల్‌లో వెతుక్కోవాల్సి వస్తుంది. ప్రపంచీకరణను స్వాగ తిస్తూనే మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విధానాలను దృష్టిలో పెట్టుకొని అడుగులు వేయాల్సిన అవసరముంది.

 వ్యాసకర్త సెల్: 8466827118