19 May, 2026 | 2:55 AM

పాక్ సైన్యం ఊచకోత

19-05-2026 01:19 AM

35 మంది బలూచ్ ఉగ్రవాదుల హతం

సైన్యం అదుపులో ముగ్గురు కీలక కమాండర్లు 

ఇస్లామాబాద్, మే 18: పాకిస్తాన్‌లో భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. బలూచిస్తాన్ ప్రాంతంలో జరిగిన ఉమ్మడి దాడిలో 35 మంది తిరుగుబాటుదారులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు కీలక కమాండర్లను సైన్యం సజీవంగా పట్టుకుంది. బలూచిస్తాన్‌లోని మంగ్లా జర్గూన్ ఘర్ ప్రాంతంలో కొన్ని రోజులుగా ఈ నిఘా ఆధారిత చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ విషయా న్ని బలూచిస్తాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి షాహిద్ రింద్ అధికారికంగా ధ్రువీకరించారు. క్వెట్టా నగరంలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆయన పూర్తి వివరాలను వెల్లడిం చారు. మే 13వ తేదీన ఈ భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభమైంది. నాలుగు రోజులుగా ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు జరుగుతున్నాయి.

ఈ ఎదురుకాల్పుల్లోనే భారీ సంఖ్యలో ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు కీలక కమాండర్లను సైన్యం అదుపులోకి తీసుకుంది. సరిహద్దుల అవతలి నుంచి జరిగిన భీకర దాడుల వల్ల చమన్ ప్రాంతంలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. అక్కడి స్థానిక ప్రజలు శిథిలాల మధ్య భయాందోళనలతో కాలం గడుపుతున్నారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలను అణచివేయడానికి సైన్యం గాలింపు చర్యలను మరింత తీవ్రం చేసింది.