అంగన్వాడీ టీచర్ నియామకాలలో పారదర్శకత పాటించాలి
బీజేపీ నేత పొనిశెట్టి వెంకటేశ్వర్లు
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 16, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల ప్రకటించిన 29 అంగన్వాడీ టీచర్ పోస్టుల నియామకాలను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని బీజేపీ మాజీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్‌ఓ పద్మావతికి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో, అంగన్వాడీ టీచర్ పోస్టులు ఇప్పిస్తామని కొందరు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు మంత్రి పేరు చెప్పి అభ్యర్థుల నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు దృష్టి సారించి, నియామక ప్రక్రియను కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని కోరారు.
ఈ నెల 18వ తేదీ తరువాత నిర్వహించనున్న అంగన్వాడీ టీచర్ పోస్టుల ఇంటర్వ్యూలను అర్హత, మెరిట్ మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే నిర్వహించి, రాజకీయ లేదా ఇతర అనుచిత జోక్యాలకు అవకాశం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, అవినీతి లేదా అక్రమాలకు ఎలాంటి తావులేకుండా పూర్తి పారదర్శకతతో నియామక ప్రక్రియను నిర్వహించి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భూక్యా మోహన్,మాదారపు లక్ష్మణ్ ,S నాగేంద్ర బాబు,భట్టు అశోక్ లు పాల్గొన్నారు.






