13 May, 2026 | 2:13 AM

బంగ్లా చేతిలో పాక్ చిత్తు

13-05-2026 12:32 AM

ఢాకా, మే 12 : ప్రపంచ క్రికెట్‌లో అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ జట్టుకు మరో ఘోరపరాభవం ఎదురైంది. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తమ కంటే చిన్నదేశమైన బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఢాకా వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 104 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 413 పరుగుల భారీస్కోర్ సాధించింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా ధీటుగానే స్పందించి 386 పరుగులకు ఆలౌటైంది.

రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని పాక్ ముందు 268 పరుగుల టార్గెట్‌ను ఉం చింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక పాక్ జట్టు చేతులెత్తేసింది. బంగ్లా పేసర్ల ఉచ్చులో చిక్కుకుని పాక్ బ్యాటర్లు విలవిల్లాడారు. ముఖ్యంగా యువ ఫాస్ట్ బౌలర్ నహిద్ రాణా అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 9.5 ఓవర్లలోనే 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు.