28 April, 2026 | 2:19 AM

పాక్ సరైన మధ్యవర్తి కాదు

28-04-2026 12:33 AM
  1. అమెరికా పట్ల పాక్‌ది పక్షపాత ధోరణి 
  2. ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు ఇబ్రహీం రెజాయీ

టెహ్రాన్, ఏప్రిల్ 27: అమెరికా--ఇరాన్ దేశాల మధ్య పాక్ సరైన మధ్యవర్తి కాదని, పాకిస్థాన్ ఎల్లప్పుడూ అమెరికా ప్రయోజనాలే కోరుటుందని, మా వైపు ఒక్కసారి కూ డా మాట్లాడలేదని ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు ఇబ్రహీం రెజాయీ ఆరోపించారు. అటు పాకిస్థాన్‌ను పూర్తిగా నమ్మలేమని ఇటీవల అమెరికా నాయకులు, మాజీ ఆర్మీ అధికారులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.

పాక్ సరైన మధ్యవర్తి కాదని అభిప్రాయపడ్డారు. ఇరాన్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్‌కు అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న ఇబ్రహీం రెజాయీ.. మధ్యవర్తిగా పాక్ పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. తమకు పాక్ మిత్ర దేశమని, అయితే ప్రస్తుతం ఆ దేశ నేతలు అమెరికా పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని అభిప్రాయ పడ్డారు. ‘పాకిస్థాన్ మనకు మంచి మిత్రదేశం. పొరుగు దేశం కూడా. కానీ అది చర్చలకు సరైన మధ్యవర్తి కాదు.

మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత దానికి లేదు. వారు ఎల్లప్పుడూ ట్రంప్ ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకుంటారు. అమెరి కన్ల కోరికలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు’ అని విమర్శించారు. ఇరు దేశాలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇరాన్ వైపు పాక్ ఒక్కసారి కూడా మాట్లాడలేదని రెజాయి గుర్తు చేశారు.

లెబనాన్‌పై దాడులు, ఇరాన్ ఆస్తులను ఫ్రీజ్ చేయడం సహా ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న పనుల గురించి పాక్ ఇప్ప టివరకు ప్రశ్నించలేదన్నారు. మధ్యవర్తి నిష్పక్షపాతంగా ఉండాలని, ఎల్లప్పుడూ ఒక పక్షం వైపు మొగ్గు చూపకూడదని ఆయన పేర్కొన్నారు.