పాక్ క్రికెటర్లను దూరం పెట్టాల్సిందే
- గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
- కావ్యా మారన్‌పై విమర్శలు
ముంబై, మార్చి 15: పాకిస్థాన్ క్రికెటర్లను కొనుగోలు చేసిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో పాల్గొనే సన్ రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడాన్ని గవాస్కర్ తీవ్రంగా విమర్శించారు. సన్ రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీకి సహ యజమానిగా ఉన్న కావ్యా మారన్, అబ్రార్ అహ్మద్‌ను భారతీయ కరెన్సీలో సుమారు రూ.2.3 కోట్లకు కొనుగోలు చేసింది.
అయితే ఈ నిర్ణయం వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో భారీ విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో భారత అభిమానులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో గవాస్కర్ తన కాలమ్‌లో స్పందిస్తూ భారత్, -పాకిస్థాన్ సంబంధాల చరిత్రను గుర్తుచేశాడు. ఆయన ప్రకారం, 2008 ముంబై అటాక్స్ తర్వాత పాకిస్థాన్ క్రికెటర్లను ఐపీఎల్ నుంచి తొలగించారు.
అదేవిధంగా 2019 పహల్గాం అటాక్ కూడా భారత క్రికెట్ సంస్థలు పాకిస్థాన్‌తో దూరంగా ఉండటానికి మరో ముఖ్య కారణంగా నిలిచిందని పేర్కొన్నారు. గవాస్కర్ వ్యాఖ్యల ప్రకారం, పాకిస్థాన్ ఆటగాళ్లకు చెల్లించే డబ్బు వారి ప్రభుత్వానికి ఆదాయంగా మారుతుందన్నారు.
ఆ డబ్బు ద్వారా ఆయుధాలు కొనుగోలు చేసే అవకాశముందని, అది పరోక్షంగా భారత సైనికులు, పౌరుల ప్రాణనష్టానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. అబ్రార్ అహ్మద్ కొనుగోలు తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో సన్ రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ ఖాతాను కొంతసేపు డియాక్టివేట్ చేయాల్సి వచ్చింది. విమర్శలు తగ్గిన తర్వాత ఆ ఖాతా మళ్లీ యాక్టివ్ అయింది.
ఇదే సమయంలో జట్టు కోచ్ డానియల్ వెటోరీ మరో పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌ను కూడా జట్టులోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్పడం మరింత వివాదానికి దారితీసింది. వెటోరి న్యూజిలాండ్‌కు చెందినవాడని, భారత్,- పాకిస్థాన్ మధ్య ఉన్న పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చని గవాస్కర్ పేర్కొన్నారు. అయితే భారతీయ యజమానులు మాత్రం పరిస్థితిని అర్థం చేసుకుని అలాంటి నిర్ణయాలను నివారించాల్సిన బాధ్యత ఉందని గవాస్కర్ వ్యాఖ్యానించారు.




