పాక్ జిమ్మిక్కులు కొత్తేం కాదు

16-09-2026 | 05:25am
  1. డొల్ల ప్రకటనలు మాని.. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలి
  2. మసూద్‌పై రూ. 70 లక్షలు ప్రకటించిన పాక్ ప్రభుత్వం
  3. అఫ్ఘాన్‌లో ఉన్నాడని ప్రకటన.. ఖండించిన తాలిబాన్లు
  4. ఎఫ్‌ఐఏ రెడ్‌బుక్‌లో మోస్ట్ వాంటెడ్ లిస్టులో జేఏఎం ఉగ్రవాది
  5. ఎఫ్‌ఏటీఎఫ్ సమావేశాలకు ముందు గ్రేలిస్ట్ తప్పించుకునేందుకు దుష్టపన్నాగాలు
  6. మండిపడ్డ భారత విదేశాంగ కార్యదర్శి రణధీర్ జైస్వాల్
  7. బంగ్లాదేశ్‌కు బ్రిక్స్ హాజరుకై రెండు ఆహ్వానాలు అందించాం
  8. భారత్ సున్నితత్వంతో మెలగాలని నిర్ణయించాయి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: జైష్ చీఫ్ మసూద్ అజార్ (Jaish chief Masood Azhar) దేశంలో లేడని అఫ్ఘానిస్థాన్‌లో దాక్కున్నాడని, అతన్ని పట్టించిన వారికి రూ. 70 లక్షలు (పాకిస్థాన్ రూపాయలు) బహుమతిని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఉన్న బహుమతిని మరో రూ. 20 లక్షలకు పెంచింది. దీనిపై భారత్ విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్రంగా స్పందించారు. పాక్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, మసూద్ అజార్ పాక్‌లోనే తలదాచుకున్నట్లుగా తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొన్నారు.

బహుమతిని ప్రకటించడం ద్వారా ప్రపంచదేశాలను తప్పుదోవ పట్టించేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నమని ఆయన మండిపడ్డారు. పాక్ ప్రకటనపై మంగళవారం సాయంత్రం రణధీర్ స్పందించారు. ప్రకటనలు చేయడం మాని ఉగ్రవాదులపై ఇస్లామాబాద్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాక్ చేసేవన్నీ డొల్ల ప్రకటనలేనన్నారు.

ఈ జిమ్మిక్కులు కొత్తవేం కాదని, ఉగ్రవాదానికి మద్దతునిచ్చే దేశం బూటకపు ప్రకటనలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. మసూద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని జైస్వాల్ డిమాండ్ చేశారు. కాగా ఎఫ్‌ఐఏ (ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల రెడ్‌బుక్‌లో మసూద్ అజార్ లిస్టులో పేరు ఉంది. 2001 పార్లమెంట్‌పై ఉగ్రదాడి, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్ కోట్, 2019 పూల్వామా బాంబుదాడులు ఇలా అనేక దాడుల్లో మసూద్ అజార్ కీలకంగా వ్యవహరించాడు.

కాగా అక్టోబర్ 26 నుంచి 30 వరకు పారిస్‌లో ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ప్లీనరీ సమావేశాలకు ముందు పాక్ ఈ ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశమవుతుంది. ఎఫ్‌ఐఏ ఉగ్రవాదుల లిస్టులో గత ఐదేళ్లలో పాక్ చెందిన ఉగ్రవాదుల సంఖ్య 35 శాతం పెరిగింది. 2018లో ఎఫ్‌ఏటీఎఫ్ లిస్టులో పాక్‌ను గ్రే లిస్టులో చేర్చగా, 2021లో దాన్ని ఆ లిస్టు నుంచి తొలగించారు.

అయితే పాక్ ప్రకటనను తాలిబాన్లు తీవ్రంగా ఖండించారు. మసూద్ అజార్ అఫ్ఘాన్‌లో లేడని పాక్ చెబుతున్నవి అసత్యాలని స్పష్టం చేశారు. ఇక బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని బ్రిక్స్ సమావేశానికి భారత్ ఆహ్వానించలేదన్న వార్తలను రణధీర్ జైస్వాల్ కొట్టిపడేశారు. బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం పంపామన్నారు. బిమ్స్ టెక్ చైర్మన్‌గా సదస్సుకు హాజరుకావాల్సిందిగా కూడా రెండు ఆహ్వానాలను పంపామని స్పష్టం చేశారు.

ఒకటి ద్వైపాక్షిక, రెండోది సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానాలను పంపామని జైస్వాల్ స్పష్టం చేశారు. మరోవైపు బ్రిక్స్ సదస్సులో భారత్ పరస్పరం గౌరవం, సున్నితత్వం పాటించడానికి అంగీకరించాయన్నారు. భారత్ ఆందోళనలను ప్రధాని మోదీ ప్రస్తావించగా, చైనా ఆందోళనలను జిన్ పింగ్ ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు సున్నితత్వం ద్వారా మార్గనిర్దేశం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.


మరిన్ని వార్తలు