20 August, 2026 | 3:15 AM

పాఠశాలల్లో ‘పంచాయతీ’లు!

20-08-2026 12:00 AM

కొత్త పంచాయతీలకు పాఠశాలలే దిక్కు 

మహబూబాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలకు కార్యాలయాలు నిర్మించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలే దిక్కయ్యాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 482 గ్రామపంచాయతీలు ఉండగా అందులో దాదాపు 200కు పైగా పంచాయతీలకు సొంత భవనాలు లేవు. ఆయా పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే అధిక పంచాయతీలను నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల అద్దె భవనాల్లో, మరికొన్ని చోట్ల ఇతర శాఖలకు చెందిన ఖాళీగా ఉన్న భవనాల్లో నిర్వహిస్తున్నారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గత కొద్ది సంవత్సరాల క్రితం పంచాయతీల నిర్మాణానికి నిధులు కేటాయించినప్పటికీ , సర్పంచుల పదవీకాలం ముగియడంతో పనులను చేపట్టడానికి ముందుకు రాలేదు. తాజాగా నూతనంగా సర్పంచులు ఎన్నికైన నేపథ్యంలో మళ్లీ కొత్త పంచాయతీలకు భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పటికీ, నిధులు సరిపోవడంలేదనే ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. దీనితో నూతన పంచాయితీ భవనాలను నిర్మించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదంటున్నారు.

ఫలితంగా నూతన పంచాయతీలకు ప్రభుత్వ పాఠశాలలే ఆవాసంగా మారాయి. దీనితో నిత్యం అటు పంచాయతీ కార్యాలయ నిర్వహణ, ఇటు పాఠశాల నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. విద్యా బోధనకు పాఠశాలల్లో ఉన్న పంచాయతీల వల్ల ఆటంకం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదుల్లోనే పంచాయతీ సామాగ్రి నిలువ చేస్తున్నారని, గ్రామసభలు ఇతరత్రా సమావేశాలు కూడా పాఠశాలల్లోనే నిర్వహిస్తుండడం వల్ల ఇబ్బందిగా మారింది.

కొన్నిచోట్ల పాఠశాలలో మూతపడగా వాటిని పూర్తిస్థాయిలో పంచాయతీలు హస్తగతం చేసుకున్నాయనే విమర్శలు వస్తున్నాయి. చాలా చోట్ల శిథిలమైన పాఠశాలల భవనాల్లో పంచాయతీలను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఏర్పడ్డ పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మించాలని, అలాగే గతంలో ఉన్న పాత పంచాయతీల శిథిలమైన భవనాల స్థానంలో కొత్తవి నిర్మించాలని కోరుతున్నారు. పంచాయతీ కార్యాలయాల భవన నిర్మాణాలకు ప్రస్తుత ధరలకు అనుగుణంగా అవసరమైన నిధులను పెంచి కేటాయించాలని కోరుతున్నారు.