15-11-2025 12:07:35 AM
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): పిల్లల ఎదుగుదల, ప్రవర్తనపై తల్లితండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తల్లితండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి మాట్లాడుతూ పిల్లల ప్రవర్తన, ఎదుగుదలపై తల్లితండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలను సకల సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తుందని, ఈ క్రమంలో విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా తల్లితండ్రులు పర్యవేక్షించాలని, విద్య నాణ్యత, బోధన వివరాలను తెలుసుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల గైర్హాజరును పరిశీలించి తల్లిదండ్రులకు సమాచారం అందించాలని, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మెనూ అమలు చేస్తూ పౌష్టిక ఆహారం అందించాలని, పాఠశాలలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.
పాఠశాల పరిసరాలు, వసతి గృహం, తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షిస్తూ విద్యార్థులకు ఇబ్బందులు కలవకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యా నాణ్యతను మరింత మెరుగుపరచడానికి తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయం అవసరమని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని వాటిని సాధించేలా ప్రణాళికలు రూపొందించుకోవడంలో సరైన సూచనలు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.