15 April, 2026 | 11:26 PM

పటాన్‌చెరు ఆసుపత్రి సేవల్లో టాప్ దేశంలోనే ఏడవ స్థానం

04-11-2025 01:39 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్ చెరు, నవంబర్ 3 : ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరేందిన పటాన్ చెరు పట్టణంలో గల టంగుటూరి అంజయ్య ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నాణ్యమైన సేవలకు చిరునామాగా నిలుస్తోందని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆసుపత్రిని ఆధునిక సౌకర్యాలతో ఆధునికరించడంతో పాటు, రోగులకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని తెలిపారు. సోమవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులను అడిగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అందించిన సేవల మూలంగానే కేంద్ర ఆరోగ్య నిపుణులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి నాణ్యమైన సేవల విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో ఏడవ స్థానం లభించిందని తెలిపారు.

ఇదే దృక్పథంతో మరిన్ని అవార్డులను సాధించాలని కోరారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ యూనిట్ ద్వారా ప్రతి నెల 33 మంది రోగులు చికిత్స పొందుతున్నారని, రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులను నియమించాలని కోరుతూ అతి త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞాపన చేయనున్నట్లు తెలిపారు. 

త్వరలో మరో అంబులెన్స్ ...

పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సేవల్లో లోపం ఉండకూడదని ఎమ్మెల్యే ఆదేశించారు. సౌకర్యాలు లేవంటూ రోగులను వేరే ఆసుపత్రులకు రిఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆస్పత్రి సూపరిండెంట్ చంద్రశేఖర్, ఆర్‌ఎంవో ప్రవీణ, ఆస్పత్రి సలహా సంఘం సభ్యులు రాములు గౌడ్, కంకర సీనయ్య, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.