‘మా పని మేమే చేసుకోవాలి..’
ఆసుపత్రిలో అటెండర్లకు తప్పని రోగి సేవలు..
స్ట్రెచర్లు, వీల్చైర్లు తోసుకుంటూ పరీక్షల కోసం పరుగులు....
సిబ్బంది కొరత పేరుతో తప్పించుకుంటున్న యంత్రాంగం..
రోగుల ఇబ్బందులపై పట్టించుకునేది ఎవరు..?
వనపర్తి (విజయక్రాంతి) జూలై 1: వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యాలు కాగితాలకే పరిమితమవుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే అటెండర్లే అన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
రోగిని స్ట్రెచ్ప తీసుకెళ్లడం, వీల్చైర్లో పరీక్షా కేంద్రాలకు తరలించడం వంటి బాధ్యతలు సాధారణంగా ఆసుపత్రి సిబ్బంది నిర్వహించాల్సి ఉండగా.. సరిపడా సిబ్బంది లేరనే కారణంతో రోగుల కుటుంబ సభ్యులే ఆ పనులు చేయాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారు, వృద్ధులు, మహిళలు ఆసుపత్రి కారిడార్లలో ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
వైద్యం కోసం వచ్చిన వారికి సేవలు అందాల్సింది పోయి.. తమకు తామే సేవలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘రోగి బాధలో ఉన్న సమయంలో స్ట్రెచర్ తోసే మనుషులు కూడా అందుబాటులో లేకపోతే.. ప్రభుత్వ వైద్య సేవల లక్ష్యం ఏమిటి?‘ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సిబ్బంది కొరత ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని, అవసరమైన అటెండర్లను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారులు ఆసుపత్రులలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి రోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.






