10 July, 2026 | 6:25 PM

కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీ

30-06-2024 01:49 AM

జూలై 12 వరకు కస్టడీకి ఇస్తూ తీర్పునిచ్చిన కోర్టు

న్యూఢిల్లీ జూన్29: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయిన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను జూలై 12వరకు జ్యుడీషియల్ కస్టడీకి ఇస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు వెకేషన్ బెంచ్ జడ్జ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన 14 రోజుల పాటు సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. విచారణలో తమకు సరిగ్గా సహకరించలేదని, దాటవేత ధోరణితో సమాధానాలు ఇచ్చారని ఆయనను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరింది. సీబీఐ చెప్పిన విషయాలతో ఏకీభవించిన కోర్టు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఆయనను మొదట ఈడీ అరెస్టు చేయగా.. కోర్టు అనుమతితో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. ఆయన జ్యుడీషియల్ రిమాండ్ ముగిసిన తర్వాత ఆయనను రౌస్ ఎవెన్యూ కోర్టు జడ్జి ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టనున్నారు. 

కేజ్రీ నిజాలు దాస్తున్నారు

కేజ్రీవాల్ విచారణలో సరిగ్గా సహకరించలేదని ఆయన నిజాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీబీఐ అధికారులు ఆరోపించారు. ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. విజయ్ నాయర్‌కు కేజ్రీవాల్‌కు మధ్య ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి జరిగిన సంభాషణల గురించి కూడా సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ ఆరోపించింది. మార్చి లో దర్యాప్తు సంస్థలు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయగా.. ఆయనకు సుప్రీం కొద్ది రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 26న సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను తీహార్ జైలు నుంచి అరెస్ట్ చేశారు. ఆయనకు ఈ కేసులో పోయిన వారం బెయిల్ మంజూరైనా కానీ ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.