24 August, 2026 | 6:48 PM

నిషేధిత భూముల నుంచి పట్టా భూములను తొలగించాలి

24-08-2026 04:25 PM

కరీంనగర్ క్రైమ్ ఆగష్టు 24(విజయక్రాంతి): రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22ఏ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తూ పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదని మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. భూ బాధితులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ, అసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌ తదితర భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు రిజిస్ట్రేషన్‌ చట్టం-1908లోని 22ఏ సెక్షన్‌ ఉద్దేశించబడిందన్నారు. అయితే ఆ నిబంధనలను ఆధారంగా చేసుకుని ప్రైవేటు పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వేలాది మంది భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా 22ఏ సెక్షన్‌ దుర్వినియోగంపై నైతిక బాధ్యత వహించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో.. ఎమ్మెల్యే గంగులతో పాటు.. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, టిఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, పలువురు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు.. ప్రజా ప్రతినిధులు.. భూ బాధితులు.. బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.