23 May, 2026 | 12:45 AM

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో జిల్లా అభివృద్ధికి బాటలు

23-05-2026 12:03 AM

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్ మే 22 ( విజయక్రాంతి): శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక‘ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి, తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రజలకు మెరుగ్గా అందించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రామీణ, నియోజకవర్గ స్థాయిలలో సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుధ్యం, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, విద్య, వైద్యం, ’అరైవ్ అలైవ్’, రైతు వారోత్సవాల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ వివరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు దత్తాద్రి, అంకం మౌనిక, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.