ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
- భూ సమస్యల పరిష్కారానికి 10 రోజులే గడువు
- నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
- మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్, మే 22 (విజయక్రాంతి): ప్రతి పేదవాడికి సంక్షేమ ప్రభుత్వ ఫలాలు సరైన సమయంలో అందాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అందుకు కార్యాలయాల చుట్టూ తిప్పకుండా వెంటనే సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ మండలం గద్దలపల్లి గ్రామ శివారులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతం కంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ఫలితంగా ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ ఒకరిని చూసి మరొకరు దుబారా ఖర్చులు చేసేందుకు వెనకా డటం లేదని అభిప్రాయపడ్డారు.
పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రాబోయే రెండున్నరేళ్లలో పూర్తి చేసే దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నామని ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగు, తాగునీటి సమస్యకు కూడా పరిష్కారం అవుతుందాన్నారు. గత ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రంపై భారీ అప్పుల భారం పడిందని ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం వెనకాడటం లేదన్నారు.
జిల్లాలో రైతుల భూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. పెండింగ్లో ఉన్న సుమారు 5వేల భూ సమస్యలను పదిరోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేశారు. గడువులోగా పూర్తి చేయని ఫైళ్లను పూర్తి అయ్యేంతవరకు రాత్రింబవళ్లు పని చేసైనా పరిష్కరించాల్సిందేనన్నారు.
ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం సరికాదని, సమస్యలు పరిష్కరించని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు సేవ చేసినప్పుడే ప్రజా పాలనకు సార్ధకత లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న సుమారు 5 వేల ఫైళ్లను క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్‌దేవ్, మున్సిపల్ చైర్పర్సన్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.






