ఉపాధిహామి కూలీలకు పే స్లిప్పులు అందజేయాలి
29న జరగబోయే జిల్లా సదస్సును విజయవంతం చేయాలి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య
ఇబ్రహీంపట్నం, మే 22 (విజయక్రాంతి): నియోజకవర్గంలోని యాచారం మండలం బొల్లిగుట్ట తండ, నిలిపోచమ్మ తండ గ్రామాల్లో ఉపాధి పని చేస్తున్న కూలీలను బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి.అంజయ్య కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీలకు పే స్లిప్పులు ఇవ్వకపోవడం వల్ల వారికి రోజూవారి వేతనం ఎంత వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. నందివనపర్తి, చింతపట్ల గ్రామాల్లో రైతులు వారి భూములల్లో ఉపాధి పని చేయించుకోవడం లేదని, తద్వారా స్థానికంగా పనిలేక వందలాది మంది ఇంటివద్దే ఉంటున్నట్లు తెలిపారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగానే ఉపాధి హామీ చట్టంలో అనేక మార్పు, చేర్పులు చేసిందన్నారు. గతంలో ఉన్న గ్రూపులను, మేట్లను రద్దు చేసిందని, గడ్డపార డబ్బులు, వాటర్ బిల్లు, ప్రయాణ చార్జీలు వంటివి ఇవ్వడం లేదని ఆరోపించారు. చట్టంలో పే స్లిప్పులు ఇవ్వాలని ఉన్నా, అవి ఇవ్వకపోవడం దారుణమన్నారు. గతంలో ప్రతివారం డబ్బులు వచ్చేవని, ఇప్పుడు నెలలు గడిచిన రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం సమ్మర్ అలవెన్స్ కూడా తీసిందనిని విమర్శించారు.
కూలీలకు లబ్ధి చేకూర్చే నిబంధనలను తొలగించడం వల్ల వారిపై అదనపు భారం పడుతోందని, వేలమంది కూలీలు పనికి రావడం మానేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని పాత పద్దతినే కొనసాగించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా రోజువారి కూలీ రూ.600, పనిదినములు 200 రోజులు పని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామి చట్టం రక్షణ, కూలీల హక్కుల పరిష్కారం కొరకై ఈ నెల 29న ఇబ్రహీంపట్నంలో జరగనున్న జిల్లా సదస్సులో కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అంజయ్య విజ్ఞప్తి చేశారు.






