20 August, 2026 | 6:39 PM

ప్రభుత్వ భూమి కాపాడాలని కలెక్టర్‌కు వినతి

23-05-2024 04:31 AM

వినతిపత్రం అందజేస్తున్న సీపీఎం పార్టీ నాయకులు

అబ్దుల్లాపూర్‌మెట్, మే ౨౨ (విజయక్రాంతి): అబ్దుల్లాపూర్ మెట్ గ్రామంలో సర్వే నెం.283 ప్రభుత్వ భూమిని రక్షించాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శాశంకకు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య మాట్లాడుతూ.. అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామంలో సర్వే నెం.283 ప్రభుత్వ భూమి ఉంది. ఈ  భూమిని 2005 లోనే పీవోటీ చట్టం కింద ప్రభుత్వం ఆధీనం చేసుకుంది. ఇది భూమిలో పేదలకు పది ఎకరాల్లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, కాలనీ నిర్మించడమే కాకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది.

ఇదే భూమిలో ఎమ్మార్వో ఆఫీసు, పోలీస్ స్టేషన్ నిర్మించింది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై పల్లె ప్రగతి కింద 25 ఎకరాలలో నాటిన చెట్లను తొలగించి, భూమి మొత్తం సదును చేసి ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. తద్వారా, లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి మండలంలో ఎక్కడ ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనా వాటిని రక్షించి, అర్హులైన పేదులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు గుండె శివకుమార్, ఇరుగు భిక్షపతి, చిర్ర శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.