సీజనల్ వ్యాధులపై కేజీబీవీ విద్యార్థులకు అవగాహన సదస్సు
తుంగతుర్తి(విజయక్రాంతి): తుంగతుర్తి పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల కళాశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రావులపల్లి ఆధ్వర్యంలో వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత మరియు వర్షాకాల సీజనల్ వ్యాధుల నివారణపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి ఆధ్వర్యం వహించారు. వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు వంటి వ్యాధుల నివారణకు పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు.
పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పూల కుండీలు, డ్రమ్ములు తదితర వాటిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.అలాగే కలుషిత నీరు, కలుషిత ఆహారం వల్ల వచ్చే టైఫాయిడ్, విరేచనాలు, కలరా, కామెర్లు వంటి వ్యాధుల నివారణకు శుభ్రమైన నీటిని తాగాలని, భోజనం ముందు మరియు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని విద్యార్థినులకు సూచించారు.
ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా దోమల నివారణపై ప్రత్యేక అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా బాలికలకు ఐరన్–ఫోలిక్ యాసిడ్ (IFA) మాత్రలు పంపిణీ చేసి, రక్తహీనత నివారణకు పోషకాహారం తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది మాణిక్యమ్మ, రాజల్ బీ, పాఠశాల ప్రిన్సిపాల్ వి. వసంత, హెల్త్ అసిస్టెంట్లు గాజుల సోమన్న, యాదగిరి, నరసింహచారి, భారతి, ఎం. వసంత, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, రమాదేవి, సుస్మిత, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.






