2 August, 2026 | 11:12 PM

గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు!

24-08-2024 01:01 AM
  •  60 రోజుల్లో విలేజ్ రెవెన్యూ సెక్రటరీల నియామకం
  • రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలు 
  • వీఆర్‌వో, వీఆర్‌ఏల విద్యార్హతల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు 
  • త్వరలోనే ప్రభుత్వ పరిశీలనకు ప్రతిపాదనలు
  • నూతన ఆర్‌ఓఆర్ చట్టం అమల్లోకి వచ్చే నాటికి విలేజ్ రెవెన్యూ సెక్రటరీల నియామకం పూర్తి

బూడిద సుధాకర్ :

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రత్యేక రాష్ట్రంలో వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థ రద్దుతో గ్రామస్థాయిలో దూరమైన రెవెన్యూ సేవలను మళ్లీ పునరుద్ధరించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి విలేజ్ రెవెన్యూ సెక్రటరీని నియామకం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను మరో ౬౦ రోజుల్లోనే పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తుంది.

ఇందులో భాగంగా రాష్ట్రం లో వివిధ శాఖల్లో విలీనమైన వీఆర్వోలు, వీఆర్‌ఏల వివరాలను సేకరించిన సచివాలయ అధికారులు.. విద్యార్హతల ఆధారంగా ప్రతి పాదనలు సిద్ధంచేశారు. త్వరలోనే ప్రభు త్వ పెద్దల పరిశీలనకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. చిన్న రెవెన్యూ గ్రామానికి విలేజ్ రెవెన్యూ సెక్రటరీ, పెద్ద రెవెన్యూ గ్రామాలకు ఇద్దరు లేదా ముగ్గరిని నియమించాలని నిర్ణయించారు. ప్రతి నాలుగైదు గ్రామాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగిని పర్య వేక్షణాధికారిగా నియమించనున్నారు.

నూతన ఆర్‌వోర్ చట్టం  2024 అమల్లోకి వచ్చే నాటికి ప్రతి రెవెన్యూ గ్రామం లోను విలేజ్ రెవెన్యూ సెక్రటరీ నియామక ప్రక్రియ పూర్తవుతుందని ప్రభు త్వంలోని ఓ ఉన్నత స్థాయి అధికారి తెలిపారు. రెవెన్యూ సేవలతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అర్హుల ఎంపిక, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ బాధ్యతలు విలేజ్ రెవెన్యూ కార్యదర్శులకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

రాష్ట్రంలో 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 612 మండలాలు, 12,769 గ్రామ పంచాయతీలుండగా 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక గ్రామ రెవెన్యూ కార్యదర్శి చొప్పున 10,954 మందిని నియమించాలని నిర్ణయించింది. వీటిలో సుమారు 23 శాతం పెద్ద రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

పెద్ద రెవెన్యూ గ్రామాల్లో ఇద్దరు లేదా ముగ్గురు విలేజ్ రెవెన్యూ అధికారులను నియమిస్తేనే జనాభాకు సరిపడా సేవలను సత్వరం అందించొచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే సుమారు 13 వేల మంది అధికారులను విలేజ్ రెవెన్యూ కార్యదర్శులుగా నియమించాలని అనుకొంటుంది. ప్రతి క్లస్టర్‌కు ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లేదా సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగిని పర్యవేక్షణాధికారిగా నియమించి ప్రజలకు రెవెన్యూ సేవలను దగ్గర చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. 

వీఆర్వో, వీఆర్‌ఏలు 25,750 మంది 

రాష్ట్రంలో వివిధ శాఖల్లో విలీనం అయిన వీఆర్వోలు, వీఆర్‌ఏలు మొత్తం 25,750 మంది ఉన్నారు. వీరిలో వీఆర్‌ఏలు 20,555 మంది ఉండగా.. వీరిలో డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు 3,680 మంది, ఇంటర్మీడియట్  విద్యార్హతలున్న వారు 2,761 మంది, పదో తరగతి విద్యార్హత ఉన్న వారు 10,347 మంది, 61 సంవత్సరాల వయసు దాటిన వారు 3,767 మంది ఉన్నారు.

అలాగే ఇంటర్, డిగ్రీ అపై విద్యార్హత కలిగిన వీఆర్వోలు 5,195 మంది ఉన్నారు. 13 వేల నుంచి 14 వేల మంది అధికారులను విలేజ్ రెవెన్యూ కార్యదర్శులుగా నియమించనున్నారు. వీరి నియామకం భూ కమతాలు, జనాభా, గ్రామంలోని భూభాగం (భూముల విస్తీర్ణం) వంటి అంశాలపై మాత్రమే ఆధారపడి ఉండనున్నట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మండల కార్యాలయాల్లో ఉన్న వారిని కానీ, కొత్తగా నియామకం చేసుకొని ప్రతి క్లస్టర్‌కు ఒక రెవెన్యూ అధికారిని (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్/సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారి) నియామకం చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

గ్రామ స్థాయిలో సర్వాధికారాలు 

గ్రామ స్థాయిలో ప్రజలకు అందించే రెవెన్యూ సేవలతోపాటు విలువైన ప్రభుత్వ భూములను, చెరువులు, కాలువలు, కుంటలను, ఎండోమెంట్, ఫారెస్ట్, అసైన్డ్, అబాది, పోరంబోకు, శిఖం భూములను సంరక్షించే బాధ్యతలను ప్రభుత్వం నూతనంగా నియమించబోతున్న గ్రామ రెవెన్యూ కార్యదర్శులకు అప్పగించనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అర్హుల ఎంపిక, రెవెన్యూ రికార్డుల సవరణకు అవసరమైన క్షేత్రస్థాయి పంచనామ నిర్వహణ బాధ్యతలను కూడా విలేజ్ రెవెన్యూ అధికారులకు అప్పగించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే బీసీ కుల గణన కార్యక్రమం నిర్వహణలో విలేజ్ రెవెన్యూ కార్యదర్శులు అత్యంత కీలకంగా ఉండనున్నారు.