23 July, 2026 | 9:10 PM

బ్లాక్ దందాకు ‘సంకేత’మిదే!

31-05-2024 07:39 AM

వరంగల్‌లో విత్తన వ్యాపారుల మాయాజాలం

రైతుల డి‘మైండ్’ను బట్టి ధరలకు రెక్కలు

బ్లాక్ మార్కెట్‌లో సంకేత్, యుఎస్ విత్తనాలు

గుమస్తాలు, ఏజెంట్ల ద్వారా గుట్టుగా అమ్మకాలు

పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు

టాస్క్‌ఫోర్స్ దాడులతో వెలుగులోకి బ్లాక్ దందా

వరంగల్, మే ౩౦ (విజయక్రాంతి): రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం కష్టపడే రైతులను విత్తన వ్యాపారులు నిట్టనిలువునా ముంచుతున్నారు. అక్రమ సంపాదనలో ఆరితేరిన కొందరు వ్యాపారులు రైతుల ఆసక్తిని ఆసరాగా చేసుకుని అధిక ధరలతో అప్పనంగా దోచుకుంటున్నారు. అంతేకాదు, రైతులకు అవసరం లేని విత్తనాలను బలవంతంగా అంటగడుతూ  వ్యాపార వృద్ధితో లాభాలు గడిస్తున్నారు. పత్తి ఎక్కువగా పండించే ప్రాంతంగా పేరున్న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విత్తన వ్యాపారులు బ్లాక్‌దందాలో పేట్రేగిపోతున్నారు. ఇటీవల పలు రకాల విత్తనాల ను అధిక ధరలకు విక్రయిస్తుండగా టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకోవడం వ్యాపారుల ఆగడాలకు అద్దం పడుతోంది. 

ఉమ్మడి జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా.. 

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎరువులు, విత్తన దుకాణాలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో 1600కు పైగా దుకాణాలకు మాత్రమే లైసెన్స్‌లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే, ఎక్కువ మంది రైతులు వరంగల్, పరకాల, నర్సంపేట, జనగామ, ములుగు, తొర్రూరు, మహబూబాబాద్ పట్టణాలలోని షాపులనే ఆశ్రయి స్తుంటారు.  కేవలం చిన్న, సన్నకారు రైతులు మాత్రమే మండ ల కేంద్రాలు, గ్రామాలలో ఉన్న దుకాణాలలో విత్తనాలు కొనుగోలు చేస్తుంటా రు. వరంగల్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 1,22,358 ఎకరాలలో పత్తి సాగు చేయనున్న ట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

బిల్లులు లేకుండా అమ్మకాలు...

రైతుల డిమాండ్ ఆధారంగా కొందరు వ్యాపారులు వారు కోరిన విత్తన ప్యాకెట్లకు ఎక్కువ రేటు తీసుకోవడమే కాకుండా బిల్లులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. రైతులు ఈ సంవత్సరం నాథ్ సీడ్ కంపెనీకి చెందిన సంకేత్, యుఎస్ అగ్రిసీడ్ కంపెనీకి చెందిన యుఎస్ పత్తి విత్తనాల పట్ల ఆసక్తి చూపుతుండడంతో వ్యాపారులు  రూ.2వేల నుంచి రూ.2500 వరకు తీసుకుంటూ బిల్లులు లేకుండా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

కొందరు వ్యాపారులు మాత్రం బిల్లుల్లో ఎంఆర్‌పి ధర నమోదు చేసినా తీసుకునేది మాత్రం బ్లాక్ ధరనేనని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా వాటితోపాటు  ఇతర ప్యాకెట్లు లింక్ పెట్టి అమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత అనుభవాల దృష్ట్యా పంటల నష్టం జరిగితే ఎవరు బాధ్యులనేది ఇప్పుడు ప్రశ్నగా మారుతోంది. గ్రామస్థాయి నుంచి రైతులకు విత్తన కొనుగోళ్లపై  అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

టాస్క్‌ఫోర్స్ దాడులతో వణుకు

ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాలలో రైతులు విత్తనాల కోసం ఇబ్బందులు పడుతుండడం, వ్యాపారులు రైతులు ఆసక్తి చూపుతున్న విత్తనాలను బ్లాక్‌లో అమ్ముతున్న సంఘటనల దృష్ట్యా ప్రభుత్వం ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు.  దీంతో విత్తన వ్యాపారుల్లో వణుకు మొదలైంది. ఇంతకాలం అక్రమ వ్యాపారాలను యధేచ్ఛగా సాగించిన విత్తన డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు కలవరపడుతున్నారు.  తనిఖీలలో వ్యాపారులు అక్రమంగా నిల్వ చేసిన సంకేత్, యుఎస్ విత్తన పాకెట్లు బయట పడుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. 

రైతుల ఆసక్తి ఆసరాగా..

రైతులు ఆసక్తి చూపుతున్న విత్తనాలను ఎక్కువ ధరకు విక్రయించడం, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన విత్తనాలకు బిల్లులు లేకుండా అంటగడుతుం డడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. జిల్లాలో కొద్ది రోజులుగా ఈ తతంగం జరుగుతున్నా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం, రైతులకు అవగాహన కల్పించకపోవడం, షాపులలో స్టాకు రిజిష్టర్‌లు తనిఖీలు చేయకపోవడంతో విత్తన వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజులుగా టాస్క్‌ఫోర్స్, వ్యవసాయ శాఖ అధికారుల తనిఖీలు, దాడుల్లో విత్తన వ్యాపా రుల బ్లాక్ దందా బయట పడుతోంది. 

బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు

పత్తి విత్తన పాకెట్లు బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తప్పవు. రైతులు ఆసక్తి చూపుతున్న విత్తనాలు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. విత్తన దుకాణాలలో తనిఖీలు చేస్తున్నాం. స్టాకు రిజిష్టర్లలో తేడాలున్నట్లయితే చర్యలు తీసుకుంటాం.

  ఉషాదయాల్, 

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి