8 August, 2026 | 1:15 AM

‘టాప్ గన్’ భావనాకాంత్

08-08-2026 12:00 AM
  1. దేశంలోనే తొలి మహిళా స్క్వాడ్రన్ లీడర్ 
  2. అరుదైన ఫైటర్ పైలట్‌గా గుర్తింపు
  3. సుఖోయ్ విమానాలు నడుపుతూ అరుదైన రికార్డు నమోదు

భోపాల్, ఆగస్టు ౭: భారత వాయుసేనలో స్క్వాడ్రన్ లీడర్ భావనాకాంత్ చారిత్రాత్మక విజయం నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని ‘టాక్టిక్స్ అండ్ ఎయిర్ కాంబ్యాట్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్’ సంస్థలో ఫైటర్ కాంబ్యాట్ లీడర్ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఘనత సాధించిన మొదటి మహిళా ఫైటర్ పైలట్‌గా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. ౨౦ వారాల పాటు జరిగే శిక్షణా అత్యంత కఠినమైనది. వాయుసేన పరిధిలోని అన్ని అడ్వాన్స్‌డ్ కాంబ్యాట్ కోర్సులకంటే ఈ కోర్సు ప్రతిష్ఠాత్మకం.

వాయుసేన ఉన్నతాధికారులు వందలాది మంది సైనికులను జల్లెడ పట్టి ఈ కోర్సుకు ఎంపిక చేస్తారు. కేవలం అతి కొద్దిమంది ఫైటర్ పైలట్లకు మాత్రమే కోర్సులో ప్రవేశం లభిస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారు సంక్లిష్టమైన వైమానిక యుద్ధ దాడులకు నాయకత్వం వహిస్తారు. వీరు వాయుసేనలో అత్యంత నైపుణ్యం ఉన్న వ్యూహకర్తలుగా రాణిస్తారు.

ఈ శిక్షణ ఇచ్చే సంస్థను అమెరికా నావికాదళానికి చెందిన ప్రసిద్ధ ‘టాప్ గన్’ డ్రైవ్‌తో పోలుస్తారు. కోర్సులో పైలట్లు, యుద్ధ నిపుణులు ఆధునిక యుద్ధ వ్యూహాలు, ప్రణాళికలు, గగనతల పోరాటాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బీహార్‌లోని దర్భంగా జిల్లాకు చెందిన భావనాకాంత్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2016లో ఆమె వాయుసేనలో ఒక సాధారణ పైలట్‌గా చేరారు. ఈ క్రమంలో ఆమె అవని చతుర్వేది, మోహనాసింగ్‌తో కలసి భారత తొలి మహిళా ఫైటర్ పైలట్ల బృందంలో భాగస్వామి అయ్యారు.

2019లో డే ఫైటర్ జెట్ నడిపే అర్హత సాధించారు. తద్వారా ఆ విభాగంలో మొదటి భారతీయ మహిళగా నిలిచారు. మొదట ఆమె మిగ్ బైసన్ విమానాన్ని నడిపారు. తర్వాత సుఖోయ్-30 ఎంకేఐ విమానం నడపడంలో శిక్షణ పొందారు. 2021 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న తొలి మహిళా ఫైటర్ పైలట్ గాను ఆమె రికార్డు నెలకొల్పారు. 2024లోనూ రిపబ్లిక్ డే ఫ్లుపాస్ట్‌లోనూ ఆమె విమానాన్ని నడిపారు. భావనాకాంత్ సాధించిన తాజా విజయం వాయుసేనలో మహిళల పాత్రను మరింత పెంచింది.