పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ బదిలీ
ఆసుపత్రి అభివృద్ధిలో ఆయనది చెరగని ముద్ర
పెద్దపల్లి,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వైద్యుల బదిలీల్లో భాగంగా, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్‌కు బదిలీ అయ్యారు. ఈ బదిలీ వార్తతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గత కొన్నేళ్లుగా డాక్టర్ శ్రీధర్ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడంలో అహర్నిశలు శ్రమించారు.
ఆసుపత్రికి ఎనలేని సేవలు అందించడమే కాకుండా, తనదైన శైలిలో పరిపాలనా దక్షతను ప్రదర్శిస్తూ ఆసుపత్రిని అగ్రగామిగా నిలిపారు. ఆయన నాయకత్వంలో ఆసుపత్రి నాలుగు అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరం అందుబాటులో ఉంటూ, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా డాక్టర్ శ్రీధర్ తీసుకున్న చొరవను స్థానిక ప్రజలు, సిబ్బంది కొనియాడుతున్నారు. ఇంతటి సమర్థుడైన అధికారిని బదిలీపై వెళ్లడం ఆసుపత్రికి, పేద రోగులకు తీరని లోటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






