5 August, 2026 | 2:44 AM

పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి

05-08-2026 01:18 AM

అదనపు కలెక్టర్ రాములు 

బెల్లంపల్లి / నస్పూర్, ఆగస్టు 4 : జిల్లాలో పెండింగ్లో ఉన్న సీఎంఆర్, సాదాబైనామా, భూ భారతి దరఖాస్తులు, రీ-సర్వే పనులు తదితర కార్యక్రమాలను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వీ రాములు అన్నారు. మంగళవారం తాండూర్ మండలంలోని కార్తికేయ ఇండస్ట్రీస్ రైస్మిల్లును రెవెన్యూ ఇన్స్పెక్టర్తో కలిసి పరిశీలించి సీఎంఆర్ బకాయిల పురోగతిని సమీక్షించి పెండింగ్ సీఎంఆర్ను

ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని మిల్లర్ లను ఆదేశించారు. సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ (ఎస్‌ఎల్‌ఆర్) ఏడీతో కలిసి తాండూర్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పెండింగ్ సాదా బైనామా, భూ భారతి దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. రాంపూర్ లో జరుగుతున్న రీ-సర్వే పనుల పురోగతిని తెలుసుకుని, మరో ఐదు గ్రామాలలో అదనంగా రీ-సర్వే పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు.

బెల్లంపల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి సాదాబైనామా, భూ భారతి దరఖాస్తుల పురోగతిని సమీక్షించారు. నస్పూర్ తహసీల్దార్ సంతోష్ కుమార్ తో కలిసి నస్పూర్ మండలంలోని తీగల్పహాడ్ ఎంఎల్‌ఎస్ గోదాంను సందర్శించి ఐసీడీఎస్ కేంద్రాలు, పాఠశాలలకు నిత్యవసర సరుకుల సరఫరా పురోగతిని సమీక్షించారు. సంబంధిత డీలర్కు ఈ-కేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. స్టేజ్-2 కాంట్రాక్టర్కు సరిపడా వాహనాలను అందుబాటులో ఉంచి, ఐసీడీఎస్ కేంద్రాలు, పాఠశాలలకు సరుకులు సకాలంలో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.