12 April, 2026 | 10:33 AM

పింఛన్ పెంచేనా?

28-06-2024 05:30 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27(విజయక్రాంతి): వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఇతర దీర్ఘకాలిక రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించే ‘ఆసరా’ పింఛన్ల కోసం అభాగ్యులు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం రెండేళ్లపాటు ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయకపోవడంతో చాలామంది నిర్భాగ్యులు సర్కారు సాయం కోసం నిరీక్షిస్తున్నారు. అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కోసం లబ్ధిదారులు పింఛన్ల పెంపుపై ఆశగా వేచి చూస్తున్నారు.  హైదరాబాద్ జిల్లాలో 2021లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు కొత్త పింఛన్లు ఇచ్చారు.

అనంతరం వాటి ఊసే లేకుండా పోయింది. దాదాపు రెండేళ్లు పింఛన్ల కోసం ఎదురుచూసిన నిర్భాగ్యులు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలోనైనా తమకు ఆసరా దొరుకుతుందని ఆశపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా కొత్త వాటి ముచ్చటే లేదు. ఉన్న పింఛన్లను నాలుగు వేలకు పెంచుతామన్న హామీ జాడే లేదు. దీంతో ఆశతో కొందరు, అవసరం కోసం మరికొందరు సర్కారు నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు. 

పాత పెన్షన్ పెంపు ఎప్పుడో..?

హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం 2,72,548 మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. 1,08,249 మంది వృద్ధాప్యపెన్షన్లు , 1,11,165 మంది వితంతువులు, 30,697 మంది వికలాంగులు, 11,193మంది ఒంటరి మహిళలు , 11,183మంది వివిధ వ్యాధిగ్రస్థులు పింఛన్లు తీసుకుంటున్నారు. అలాగే ఏడుగురికి చేనేత, 54మందికి బీడీ కార్మిక పెన్షన్లు అందుతున్నాయి. 2014 ఎన్నికల తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పింఛన్లను రూ.1000కి, 2018 తర్వాత రూ.2016కు పెంచారు. మొన్నటి ఎన్నికల్లో దశల వారీగా రూ.5వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అదే సందర్భంలో కాంగ్రెస్ కూడా తన మ్యానిఫెస్టోలో ‘చేయూత’ పేరిట  రూ.4వేలు చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు వాటి ఊసే లేకపోవడంతో పింఛన్‌దారుల్లో టెన్షన్ పట్టుకుంది.  

‘చేయూత’పై ఆశలు

రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్పల్ఫ కాలంలోనే ‘ప్రజాపాలన’ పేరిట సంక్షేమ పథకాల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించారు. వివిధ పథకాలతో పాటు చాలామంది పెన్షన్ల కోసం అర్జీలు పెట్టుకున్నారు. అంతేకాదు, వారంవారం జరిగే  జిల్లా గ్రీవెన్స్ సెల్‌లోనూ ఇప్పటికీ వినతలు అందజేస్తున్నారు.  జిల్లాలో  ప్రస్తుతం పదివేల మంది వరకు కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆన్‌లైన్ అవకాశం కూడా లేదు..

ఏడేళ్ల క్రితం వరకు పింఛన్ల దరఖాస్తులను మ్యాన్యువల్‌గా చేసేవారు. అనంతరం ఆన్‌లైన్ విధానం అమలులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేవారు. అయితే, 2022 నుంచి ఆన్‌లైన్ సేవలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో అప్పటి నుంచి దరఖాస్తులు తీసుకునే వారు లేక, చాలామంది ఆసరా కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ దరఖాస్తులతో ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి ఎప్పుడొస్తాయోనని ఆందోళనతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. మరి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్‌లైన్ సేవలను తెరుస్తుందా? ఆఫ్‌లైన్‌లో తీసుకున్న దరఖాస్తులకే మోక్షం కల్పిస్తుందో వేచిచూడాల్సిందే.