తెలంగాణ సంస్కృతి చాటేలా బోనాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేలా ఈ ఏడాది బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలపై గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొని ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల పండుగ సందర్భంగా దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. జూలై 21వ తేదీ బోనాలు, అమ్మవారి దర్శనం కార్యక్రమాలు ఉండగా, 22న ఉదయం 9 గంటలకు రంగం, గజాధిరోహణ మహోత్సవం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు.
1830 నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రతి సంవత్సరం బోనాలు సమర్పిస్తున్నారని మంత్రి పొన్నం చెప్పారు. అధికారు లంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈసారి బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఆలయ పరిసరాల్లో లైటింగ్, ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు నిరంతర నీటి సరఫరా, నిరంతర విద్యుత్తు ఏర్పాటుతో పాటు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని, పోలీసుల సమక్షంలో బారికేడ్ల ఏర్పాటు చేపట్టా లని ఆయన అన్నారు. తాగునీటికి వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిళ్లు, 4 హెల్త్ క్యాంప్‌లు, శిక్షణ పొందిన పీసీఆర్ బృందా లు, ప్రత్యేక అంబులెన్స్, ఫైర్ ఇంజిన్, వెల్‌కమ్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూ టీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, సెక్రటరీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.




