16 April, 2026 | 7:18 AM

ఇరాన్ నుంచి మరో 310 మంది

22-06-2025 12:06 AM
  1. కొనసాగుతున్న ‘ఆపరేషన్ సింధు’
  2. ఇప్పటి వరకు 827 మంది విద్యార్థులు స్వదేశానికి
  3. నేపాల్, శ్రీలంక పౌరులను తరలించేందుకు ఏర్పాట్లు

న్యూఢిల్లీ, జూన్ 21: ఇరాన్‌లో చిక్కుకున్న భారత జాతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధు’ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటికే 510 మంది సురక్షితంగా స్వదేశానికి చేరుకోగా.. తాజాగా 310 మందితో కూడిన మూడో విమానం శనివారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది.

ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటి వరకు ఇరాన్‌లో చిక్కుకున్న 827 మంది భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చినట్టు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరం కావడంతో అక్కడున్న భారతీయులను తరలించేందుకు కేంద్రం ఆపరేషన్ సింధు చేపట్టింది.  ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక నిర్ణ యం తీసుకుంది.

ఇరాన్‌లో చిక్కుకున్న నేపాల్, శ్రీలంక పౌరులను కూడా తీసుకురానున్నట్టు భారత ఎంబసీ తెలిపింది. తమ పౌరులను సురక్షితంగా తీసుకురావాలని నేపాల్, శ్రీలంక ప్రభుత్వాలు భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. దీనికి అంగీకరించిన భారత్ మన వాళ్లతో పాటు నేపాల్, శ్రీలంక పౌరులను కూడా విమానాల్లో తీసుకురానుంది.