ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
శంకర్‌పల్లి, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): మహిళలు ప్రయాణాలు చేసే సమయంలో వీలైనంత వరకు బంగారు ఆభరణాలు ధరించకపోవడమే ఉత్తమమని చేవెళ్ల ట్రాఫిక్ సిఐ సతీష్ సూచించారు. బుధవారం రాత్రి శంకర్పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రయా ణికులకు భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రయాణికులు పాటించాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు.ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం హడావుడిగా ఎక్కే సమయంలో జరిగే తోపులాటను ఆసరాగా చేసుకుని దొంగలు ఆభరణాలు తస్కరించే అవకాశం ఉందని, కావున ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తెలియని వ్యక్తులు ఇచ్చే తినుబండారాలను అస్సలు తీసుకోకూడదు. కొందరు పరిచయం పెంచుకుని నమ్మకంగా మాట్లాడినా వారిని నమ్మి లగేజీని అప్పగించి ఎక్కడికీ వెళ్లరాదని హెచ్చరించారు.
రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మహిళలు కిటికీల వద్ద కూర్చోకపోవడం మంచిదని, ఒకవేళ కూర్చున్నా మెడలోని ఆభరణాలు బయటకు కనిపించకుండా స్కార్ఫ్ లేదా చీరతో కప్పి ఉంచుకోవాలని సూచించారు. నేరాల నివారణకు, అసాంఘిక శక్తుల కదలికల పట్ల ప్రజలు పోలీసులకు సమాచారం అందించి సహకరించాలన్నారు.
చివరగా, ఎక్కడైనా అనుమానితులు కనిపిస్తే లేదా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని సిఐ సతీష్ స్పష్టం చేశారు.






