22 August, 2026 | 11:57 PM

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

22-05-2024 02:30 AM

సైబర్ సెక్యూరిటీ బ్యూరో సుభాష్ చంద్రబోస్

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

మెదక్, మే 21 (విజయక్రాంతి) : మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి ఆదేశాల ప్రకారం జూన్ 8న మెగా లోక్ అదాలత్ ఉన్నందున సైబర్ నేరాల పరిష్కారానికి మంగళవారం అవగాహన సదస్సును సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మెదక్, తూప్రాన్ సబ్ డివిజన్ కార్యాలయాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఇంటర్‌నెట్ ఆధారంగా జరిగే వ్యక్తిగత, ఆర్థిక, భద్రత పరమైన నేరాలను సైబర్ నేరాలు అంటారని, ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ప్రైవసీని భగ్నం చేయడం, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడం, భద్రతకు ముప్పు కలిగించడం వంటి నేరాలను సైబర్ నేరగాళ్లు చేస్తున్నారని తెలిపారు.

ఈ నేరాలను ప్రత్యక్షంగా కాకుండా ఆన్‌లైన్ ద్వారా సైబర్ క్షేత్రంలో జరుగుతాయని, రోజువారీ కార్యక్రమాలు ఆన్‌లైన్ ద్వారా నిర్వహించడం వల్ల నేరాల సంఖ్య కూడా పెరిగిం దన్నారు. సాదారణ ప్రజలు ఆశ, భయం వల్ల సైబర్ నేరాల వలలో చిక్కుతున్నారని వాపోయారు. బాధితులు పోగొట్టుకున్న డబ్బులను వారికి తిరిగి ఎలా రీఫండ్ చేయాలి, అనుమానిత బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను ఎలా సేకరించాలనే విషయాలను సైబర్ వారియర్స్, సిబ్బందికి వివరంగా తెలిపారు. సైబర్ నేరాల భారిన పడకుండా ప్రతి ఒక్కరూ అవగాహన పొంది జాగ్రత్తగా ఉండాలన్నారు.

సెల్‌ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు. సైబర్ నేరానికి గురయితే 1930 టోల్ ఫ్రీ నంబర్ లేదా సైబర్‌క్రైం వెబ్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో మెదక్, తూప్రాన్ డీఎస్పీలు డాక్టర్ రాజేశ్, వెంకట్‌రెడ్డి, సీఐలు, సైబర్ వారియర్లు, సిబ్బంది పాల్గొన్నారు.