చలో ఫారిన్ టూర్
18-05-2024 12:28 AM
మూడు నెలల్లో 9.7 కోట్ల మంది విదేశీ ప్రయాణాలు
మాస్టర్‌కార్డ్ రిపోర్ట్
న్యూఢిల్లీ, మే 17: దేశంలో పెరుగుతున్న మధ్యతరగతి, విస్తరిస్తున్న విమాన సేవలతో గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయులు విదేశీ ట్రిప్ వేస్తున్నారు. 2024 జనవరి మధ్య మూడు నెలల కాలంలో 9.7 కోట్ల మంది భారతీయ ఎయిర్‌పోర్టుల ద్వారా ప్రయాణించారని మాస్టర్‌కార్డ్ ఎకానమిక్ ఇనిస్టిట్యూట్ ‘ట్రావెల్ ట్రెండ్స్’పై తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. పదేండ్ల క్రితం ఈ స్థాయిలో ప్రయాణీకుల సంఖ్యను ఎయిర్‌పోర్టులు చూసేందుకు ఏడాది సమయం పట్టేదని తెలిపింది. మాస్టర్‌కార్డ్ స్పెండింగ్‌పల్స్, థర్డ్‌పార్టీ డేటాలను వినూత్నంగా విశ్లేషించి ఈ రిపోర్ట్ రూపొందించినట్టు కంపెనీ పేర్కొంది. దేశీయంగా విమానాల్లో ప్రయాణించేవారు 2019తో పోలిస్తే 21 శాతం పెరగ్గా, విదేశీ ప్రయాణాలు చేసేవారు 4 శాతం పెరిగిందని తెలిపింది.
యూఎస్ ప్రయాణాలు 59 శాతం పెరిగాయ్
కొన్ని ప్రధాన దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య బాగా పెరిగిందని మాస్టర్‌కార్డ్ పేర్కొంది. డాలరు మారకపు విలువ గరిష్ఠస్థాయిలో ఉన్నప్పటికీ, 2019తో పోలిస్తే యూఎస్‌కు వెళ్లేవారి సంఖ్య 59 శాతం పెరిగిందని, జపాన్ సందర్శించేవారు 53 శాతం పెరిగారన్నది. డాలరు బలపడి, రూపాయి బలహీనపడినందున విదేశీ ప్రయాణాలకు ఖర్చులు పెరుగుతాయి. వియత్నాంకు వెళ్లే ప్రయాణీకులు భారీగా 248 శాతం పెరిగారని, దేశాలన్నింటినీ చుట్టిరావాలన్న ఆకాంక్షను ఇది ప్రతిబింబిస్తున్నదని రిపోర్ట్ వివరించింది. ఫ్లుటై బుకింగ్స్ ప్రకారం ఇండియన్ ట్రావెలర్లకు ఈ వేసవిలో (జూన్ టాప్ ఫైవ్ ట్రెండింగ్ నగరాలుగా అమ్‌స్టర్‌డమ్, సింగపూర్, లండన్, ఫ్రాంక్‌ఫర్ట్, మెల్‌బోర్న్‌లు ఉన్నాయన్నది.
వచ్చే కొద్ది సంవత్సరాల్లో విదేశాల్లో విహరించే భారతీయుల సంఖ్య పెరుగుతూనే ఉంటుందని మాస్టర్‌కార్డ్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఎకానమిస్ట్ డేవిడ్ మాన్ చెప్పారు. దీనికి ప్రధాన కారణం మధ్యతరగతి పెరగడమేనని, వచ్చే ఐదేండ్లలో 2 కోట్ల మంది మధ్యతరగతిలోకి, మరో 20 లక్షల మంది అధికాదాయ గ్రూప్‌లోకి ప్రవేశిస్తారని తాము అంచనా వేస్తున్నట్టు తెలిపారు. నేడు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు భౌతిక వస్తూత్పత్తులకంటే అనుభవాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, దీంతో ప్రయాణాలకు వ్యయపరుస్తున్నారని నివేదిక తెలిపింది. టూరిజం ద్వారా నైట్‌లైఫ్, ఫైన్‌డైనింగ్ అనుభూతులను పొందాలనుకుంటున్నారన్నది. 2024 మార్చినాటికి గత ఏడాదితో పోలిస్తే క్యాజువల్ డైనింగ్ 49.2 శాతం పెరగ్గా, ఫైన్‌డైనింగ్ 55.2 వృద్ధిచెందిందని మాస్టర్‌కార్డ్ నివేదిక వివరించింది.






