5 July, 2026 | 10:13 AM

రెండు లోహాలూ రికార్డు ధరలు

19-05-2024 12:05 AM

 రూ.870 ఎగిసి రూ. 74,620 స్థాయికి తులం బంగారం

రూ.4,000 పెరిగి రూ.96,500 వద్దకు కేజీ వెండి

హైదరాబాద్, మే 18: ప్రపంచ మార్కెట్లో వువ్వెత్తున పెరిగిన ప్రభావంతో భారత్‌లోనూ వెండి బంగారాలు రెండూ కొత్త రికార్డుస్థాయిలకు చేరాయి. శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో  24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఒక్క ఉదుటన రూ.870 మేర పెరిగి రూ.74,620 చరిత్రాత్మక గరిష్ఠ స్థాయినిఅందుకుంది. బంగారం మూడు వారాల క్రితం నెలకొల్పిన రూ.74,340 రికార్డు ధరను తాజా అధిగమించింది. 22 క్యారట్ల పుత్తడి తులం ధర రూ.800 పెరిగి రూ.68,400 వద్ద నిలిచింది. వెండి మరింత భారీగా పెరిగింది. హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో కేజీ వెండి ధర ఒక్క ఉదుటన రూ. 4,000 ఎగిసి రూ.96,500 వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. గత మూడు రోజుల్లో ఇది రూ.6,000 వరకూ పెరిగింది.

ప్రపంచ మార్కెట్ల ప్రభావం

యూఎస్ కేంద్ర బ్యాంక్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు బలపడటంతో శుక్రవారం రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి, వెండి భారీగా పెరిగాయి.  ఔన్సు పుత్తడి ఫ్యూచర్ ధర 30 డాలర్లకుపైగా పెరిగి మళ్లీ  2,425 డాలర్ల రికార్డు సమీపానికి చేరింది. దీంతో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో సైతం పూర్తి స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర రూ.73,700 స్థాయికి చేరింది. ఇదే సమయంలో ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర 31.5 డాలర్ల స్థాయికి పెరిగింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లోనూ పడి వెండి బంగారాల ధరలు పెరిగాయని బులియన్ ట్రేడర్లు వివరించారు.