13-12-2025 12:00:00 AM
డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 12: తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు మద్దతు పలికారని, పెద్ద ఎత్తున పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించారని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో అన్ని వర్గాల వారు కాంగ్రెస్ ను ఆదరించినట్లు తెలిపారు.
గ్రామాల్లో అభివృద్ధి జరగాలనే ఆకాంక్షతో ప్రజలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించినట్లు తెలిపారు. ప్రజలు మా పట్ల చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రెండు అంతకంటే ఎక్కువ మా పార్టీ అభ్యర్థులు నిలబడడం వల్ల కొన్ని చోట్ల స్వల్పతేడాతో ఓడినట్లు తెలిపారు. కొన్ని లోటుపాట్లు జరిగాయని, రాబోయే రోజుల్లో వాటిని సరిచేసుకుంటామని అన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకుపోతామని అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలు ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసి గెలిచినట్లు ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, రాజకీయాలు చూడకుండా అభివృద్ధి కోసం రెండో విడత ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులకు అధిక సంఖ్యలో ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, సీనియర్ నాయకులు చంద్రకుమార్ గౌడ్, డిసీసీ మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ అవేజ్, నాయకులు బాలస్వామి, ప్రవీణ్ కుమార్, చందుయాదవ్, రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.