19 June, 2026 | 3:33 AM

ఈపీఎఫ్‌వో వడ్డీకి కేంద్రం ఆమోదం

19-06-2026 02:31 AM
  1. ఈ నెలాఖరున ఖాతాల్లో 8.25 శాతం జమ
  2. వరుసగా మూడో ఏడాది కూడా ఇదే వడ్డీ

న్యూఢిల్లీ, జూన్ 18: ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం తీపికబురు చెప్పింది. వార్షిక వడ్డీ 8.25శాతానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వడ్డీ ఈ నెలలోనే జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.25 శాతం వార్షిక వడ్డీ 2025-26 సంవత్సరానికి అందించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) మార్చి 2న చేసిన సిఫార్సులకు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఆమోద ముద్ర వేసింది. దీంతో వరుసగా మూడో ఏడాదీ కూడా ఇదే వడ్డీ రేటు అందజేస్తున్నట్లయ్యింది.

అయితే ఈ ఏడాది ఖాతాదారులకు వడ్డీ జమ నిర్ణయం నెలరోజులు ఆలస్యం కావడం గమనార్హం. వడ్డీ జమ అయ్యేందుకు జూన్ నెలాఖరు పట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆర్థిక సంవత్సరం ముగిసి మూడు నెలలు కావొస్తుంది. ఆ మేరకు చక్రవడ్డీ ప్రయోజనాలు కోల్పోతామన్న ఆందోళన ఖాతా దారుల్లో ఉంది. అలాంటి భయాలు ఏమీ అక్కరలేదని ఈపీఎఫ్‌వో సంస్థ స్పష్టం చేసింది.

నిల్వలపై ఏ సంవత్సరం, నెలలోని వడ్డీని అదే నెలలో గణిస్తారని తెలిపింది. ఖాతాదారులకు జమయ్యేది మాత్రం ఏడాది చివర్లోనే అని తెలిపింది. దీంతో ఖాతాదారుల్లో ఉన్న చక్రవడ్డీ భయం కూడా తొలగినట్లయ్యింది. 2020-21లో 8.10 శాతం వడ్డీ చెల్లించగా, 2022-23 8.15 శాతానికి పెంచారు. 2022-24 నుంచి 8.25 శాతం వడ్డీని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు వరుసగా మూడేళ్ల నుంచి ఈపీఎఫ్‌వో చెల్లిస్తుంది.