క్రమశిక్షణ అంకిత భావంతో విధులు నిర్వహించాలి
100 మీటర్ల పరిధిలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలి..
జిల్లా ఎస్పి నరసింహ..
గరిడేపల్లి (విజయక్రాంతి): క్రమశిక్షణ అంకిత భావంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం గరిడేపల్లి మండల పరిధిలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న పోలీస్ సిబ్బందికి గరిడేపల్లి పోలీస్ స్టేషన్ లో అవగాహన సమావేశం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ సిబ్బంది పాత్ర కీలకమని ఎస్పీ తెలిపారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా సూచించారు. విధులు పూర్తయ్యేవరకు కేటాయించిన ప్రాంతాలను విడిచిపెట్టవద్దని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్ధతిలో ఉంచాలని ఆదేశించారు.
అనుమతిలేని వ్యక్తులను పోలింగ్ కేంద్రాల పరిసరాల్లోకి అనుమతించవద్దని, 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని తెలిపారు. ఓటర్లు సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువస్తున్నారా అనే అంశంపై నిఘా ఉంచాలని సూచించారు. ఎన్నికల కోడ్ (ఎంసీసీ) నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఉన్నత అధికారులకు తెలియజేయాలని, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. గరిడేపల్లి మండలంలో మొత్తం 10 రూట్లు, 26 గ్రామాల్లో 49 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కోదాడ డీఎస్పీ బి. శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 5 సీఐలు, 9 ఎస్‌ఐలు, 160 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, పీసీలు, హోమ్ గార్డులతో కలిపి మొత్తం 170 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మండలంలో సెక్షన్ 144 అమల్లో ఉన్నందున గుమికూడవద్దని ప్రజలకు సూచించారు. పొనుగోడు, వెలిదండ, గడ్డిపల్లి, కుతుబ్షాపురం, గానుగబండ, గారకుంట తండా, కల్మలచెరువు, శీత్ల తండా, సొమ్ల తండా, లుంబ తండా, రాయనిగూడెం, రంగాపురం, కీతవరిగూడెం గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ బి. శ్రీనివాస్ రెడ్డి, హుజూర్‌నగర్ సీఐ జి. చరమంద రాజు, మునగాల సీఐ రామకృష్ణ రెడ్డి, గరిడేపల్లి ఎస్‌ఐ నరేష్‌తో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






