జనచైతన్య కాలనీలో తీరని మౌలిక కష్టాలు
రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై కాలనీవాసుల పోరాటం
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు వినతిపత్రం సమర్పణ
త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ
మణికొండ, జూలై 3 (విజయక్రాంతి): చిత్రపురి కాలనీ పరిధిలోని జనచైతన్య కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, నార్సింగి సర్కిల్ అసిస్టెంట్ ఇంజనీర్ శివప్రసాద్లను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాలనీలో నూతన రోడ్ల నిర్మాణం చేపట్టాలని, అధ్వాన్నంగా మారిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు నిరంతర తాగునీటి సరఫరా అందించాలని కోరారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, అధికారులు సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వి. వంశీ కృష్ణ, జనరల్ సెక్రటరీ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ జి. రామానధం పాల్గొన్నారు. ఈ వినతిపత్రం సమర్పణ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రత్యేకంగా సహకరించిన రామకృష్ణ రెడ్డి, లక్ష్మీ శ్రీ, గంగాధర్, శ్రీరాములుకు సంక్షేమ సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీవాసుల సంక్షేమం, అభివృద్ధి కొరకు అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.






