రోషం, పౌరుషం ఉంటే రాజీనామాకు సిద్ధమని చెప్పాలి
- హరీశ్, కేటీఆర్‌కు మంత్రి జూపల్లి సవాల్
- మాటల గారడీ ఆపి దమ్ముంటే చర్చకు రండి
- పాలమూరు పౌరుషమే నాది
- తోకముడిచే ప్రసక్తే లేదు
- అప్పుల లెక్కలపై మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టీకరణ
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి) : ‘నాది పాలమూరు పౌరుషమే! గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, బకాయిలపై నేను చేసిన వ్యాఖ్యలు, లెక్కలకు కట్టుబడి ఉన్నా. అబద్ధమని రుజువు చేస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తా. కేటీఆర్, హరీశ్‌రావు సిద్ధమేనా? వారికి రోశం, పౌరుషం ఉంటే రాజీనామాకు సిద్ధమని చెప్పాలి. మాటల గారడీ ఆపి దమ్ముంటే సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు చర్చకు రావాలి’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు.
లేకుంటే బీఆర్‌ఎస్ సిగ్గు తప్పిన పార్టీగా మిగిలిపోతుందని విమర్శించారు. అప్పులపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు వివరంగా లేఖలు రాశానని, హరీశ్ కట్టుకథలతో తిరిగి తనకు లేఖ పంపారని మంత్రి మండిపడ్డారు. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తా.. అన్నట్లుగా కేటీఆర్, హరీశ్‌రావు తీరు ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని, దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులపై చర్చించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నేతలతో కలిసి మంత్రి జూపల్లి శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వచ్చి మీడియాతో మాట్లాడారు. అంతకుముందు సీఎల్పీలోనూ విలేకరులతో మాట్లాడుతూ.. హరీశ్‌రావు రాసిన లేఖపై జూపల్లి స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న అప్పులు మాత్రమే రూ.4.17 కోట్లుగా పేర్కొన్న హరీశ్.. కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాలను అందులో పేర్కొనలేదన్నారు.
కాళేశ్వరం, మిషన్ భగీరథ కోసం తీసుకున్న అప్పులను ప్రభుత్వం చెల్లించకపోతే.. కార్పొరేషన్లు ఎలా చెల్లిస్తాయని ప్రశ్నించారు. అప్పులపై తాను చెప్పే లెక్కలు తప్పని కేసీఆర్‌తో చెప్పించాలని డిమాండ్ చేశారు. తన లెక్కలు తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
ఎప్పుడు ఎంతెంత అప్పు చేశారో లేఖలో వివరంగా చెప్పానని, హరీశ్‌రావు ఆ వివరాలేవీ లేఖలో పేర్కొనలేదని తెలిపారు. హరీశ్‌రావు, కేటీఆర్‌కు మాటల గారడీ ఆపి.. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. వారికి ఏమాత్రం రోషం, పౌరుషం ఉన్నా రాజీనామాకు సిద్ధమని చెప్పాలని డిమాండ్ చేశారు.
‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్’
అప్పులపై కేటీఆర్, హరీశ్‌రావు పూటకో మాట మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి మండిపడ్డారు. వారి తీరు ’ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అసలు వీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నారా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో అప్పులు, బకాయిలు కలిపి అక్షరాలా రూ.8,21,651 కోట్ల అప్పు చేశారని మంత్రి మరోమారు ఉద్ఘాటించారు. వాస్తవాలు తేల్చడానికి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు తాను లేఖ రాస్తున్నట్లు జూపల్లి వెల్లడించారు.
ఈ లేఖను వాట్సాప్, ఈa స్పీడ్ పోస్ట్ ద్వారా పంపుతున్నా. నేను చెప్పిన లెక్కలకు కట్టుబడి రాజీనామాకు సిద్ధమయ్యా. మరి నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఏం చేస్తారో రాతపూర్వకంగా చెప్పాలి? ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారా, లేక కేసీఆర్ తన పార్టీని రద్దు చేస్తారా? అని పేర్కొన్నారు. తనకు పదవుల కంటే ఆత్మగౌరవమే ముఖ్యమని, గతంలో ఆత్మగౌరవం కోసమే ప్రభుత్వ ఉద్యోగానికి, ఆ తర్వాత మంత్రి పదవికి కూడా రాజీనామా చేశానని మంత్రి జూపల్లి గుర్తుచేశారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారని, నేను మంత్రి పదవికి రాజీనామా చేశాకే బీఆర్‌ఎస్‌కు ఆరు సీట్లు వచ్చాయన్నారు. ఎన్నికల ముందు ఔటర్ రింగ్ రోడ్డు లీజును అడ్డగోలుగా అమ్మి వచ్చిన డబ్బుల్లో కేవలం రూ.5,800 కోట్లు మాత్రమే రైతుబంధు కింద చెల్లించారని ఆరోపించారు.






