25 July, 2026 | 8:05 AM

విజయ ఢంకా

03-06-2024 12:22 AM

అరుణాచల్‌లో బీజేపీ..

మొత్తం ౬౦ సీట్లకు గాను

౪౬ సీట్లలో విజయం

సిక్కింలో ఎస్‌కేఎం..

మొత్తం ౩౨ సీట్లకు గాను

౩౧ సీట్లలో ఘన విజయం

సిక్కిం అసెంబ్లీకి వరుసగా ౮ సార్లు గెలుస్తూ వచ్చిన మాజీ సీఎం పవన్ చామ్లింగ్ ఈసారి రెండు స్థానాల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలుపు

సిక్కింలో ఎస్‌కేఎం పార్టీకి బంపర్ మెజారిటీ

32 స్థానాలకు 31 సీట్లు గెలుచుకున్న ఎస్‌కేఎం

25 అధికారంలో ఉన్న సీడీఎఫ్ ఒకే ఒక్క సీటుకు పరిమితం

న్యూఢిల్లీ, జూన్ 2: రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్రాల అసెంబ్లీ ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోగా, సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం) అధికారంలోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌లో మొత్తం 60 సీట్లకు గాను 46 సీట్లను బీజేపీ కైవసం చేసుకుని గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. సిక్కింలో 32 సీట్లకు గాను ఏకంగా 31 సీట్లను ఎస్‌కేఎం గెలుచుకుని బంపర్ గెలుపు తన ఖాతాలో వేసుకుంది. ప్రతిపక్ష పార్టీ అయిన సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్‌ను ఊడ్చి పడేసింది.

10 సీట్లు బీజేపీ ఏకగ్రీవం

అరుణాచల్‌ప్రదేశ్‌లో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 10 స్థానాలను ఎన్నికల ముందే బీజేపీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 50 సీట్లకు ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. నేషనల్ పీపుల్స్ పార్టీకి ఐదు సీట్లు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్‌కు  రెండు సీట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు మూడు సీట్ల చొప్పున గెలుచుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక సీటును గెలుచుకుంది.

ఎస్డీఎఫ్‌కు ఘోర ఓటమి..

సిక్కింలో 2019 వరకు 25 ఏళ్ల పాటు వరుసగా పాలించిన సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (సీడీఎఫ్) ఒకే స్థానంలో గెలుపొందడం గమనార్హం. ఆ పార్టీ అధ్యక్షుడు, దేశంలోనే సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. లోక్‌సభ స్థానాలతో పాటు, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఫలితాలను జూన్ 4వ తేదీన లోక్‌సభ ఫలితాలతో పాటే ప్రకటిస్తామని తొలుత కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించినప్పటికీ ఆదివారంతో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ గడువు ముగిసిపోయింది. దీంతో ఆదివారమే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించింది.

మళ్లీ ఓడిపోయారు

మరోసారి భైచుంగ్ భూటియా ఓటమి

భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో బార్‌ఫుంగ్ స్థానం నుంచి పోటీచేసి మరోసారి ఓటమిని చవిచూశారు. సిక్కిం డెమోక్రటిక్ పార్టీ(ఎస్‌డీపీ) నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడి అధికార పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం) అభ్యర్థి రిక్షల్ దోర్జీ భూటియా చేతిలో 4,346 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయన గతంలో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ అసెంబ్లీ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరఫున పోటీ చేసి రెండుసార్లు ఓటమిపాలయ్యారు. 2016 లోక్‌సభ ఎన్నికల్లో  సిలిగురి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి పశ్చిమ బెంగాల్ నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ ఓటమి చవిచూశారు. 2018లో హమ్రో సిక్కిం పార్టీని స్థాపించిన భైచుంగ్ భూటియా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గత ఏడాది ఎస్‌డీపీలో తన పార్టీని విలీనం చేశారు. 2019లో సిక్కింలోని గ్యాంగ్‌టక్, తుమెన్ లుంగి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి రెండుచోట్లా ఓడిపోయారు. దీంతో తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఆరుసార్లు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఏప్రిల్ 19న అక్కడ ఎన్నికల జరిగాయి. ఆదివారం ఎన్నికల లెక్కింపు ప్రక్రియ జరగగా మధ్యాహ్నానికే బార్‌ఫుంగ్ అసెంబ్లీ స్థానం ఫలితాలు వెలువడ్డాయి.

39 ఏళ్లలో తొలి ఓటమి.. 

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో 1994 నుంచి 2019 వరకు సీఎంగా పనిచేసిన పవన్ చామ్లింగ్.. ఈ ఎన్నికల్లో పాక్లోక్ కామ్రాంగ్, నామ్చేబంగ్ స్థానాల నుంచి బరిలో దిగారు. 1985 నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన పవన్.. 39 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓడిపోయారు. పాక్లోక్ కామ్రాంగ్‌లో ఎస్‌కేఎం అభ్యర్థి భోజ్‌రాజ్ రాయ్ చేతిలో 3 వేల ఓట్ల తేడాతో, నామ్చేబంగ్‌లో రాజు బసంత్ చేతిలో 2 వేల పై చిలుకు ఓట్లతో ఓటమి చవిచూశారు. కాగా, అరుణాచల్‌ప్రదేశ్‌లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

టీచర్ నుంచి సీఎం దాకా

సిక్కింలో ప్రభంజనం సృష్టించిన ప్రేమ్ తమాంగ్.. 1968 ఫిబ్రవరి 5న నేపాలీ దంపతులకు జన్మించారు. పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1990లో గవర్నమెంట్ టీచర్‌గా చేరి, మూడేళ్ల పాటు పనిచేశారు. అయితే ఆ తర్వాత సామాజిక సేవపై ఆసక్తితో రాజకీయాల వైపు మళ్లారు. 1994లో పవన్ చామ్లింగ్ స్థాపించిన సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్‌లో చేరి, కీలక నాయకుడిగా ఎదిగారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, పలు శాఖల మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల తర్వాత ఎస్‌డీ ఎఫ్‌తో విబేధాలతో బయటకు వచ్చిన తమాంగ్.. రాజకీయ గురువుపై తిరుగు బావుటా ఎగురవేశారు. 2009 డిసెంబర్ 21న భారీ బహిరంగ సభ ఏర్పా టు చేసి సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటుకు సిద్ధమైనట్టు ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరినా ఎక్కువ కాలం అందులో ఉండలేదు. చివరికి 2013లో సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీని  స్థాపించారు. 2014 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి, 10 సీట్లు సాధించుకున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి, తన పాలనతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.