తీహార్ జెలుకు కేజ్రీవాల్
బెయిల్ గడువు ఆదివారంతో పూర్తి
లిక్కర్ కేసులో మళ్లీ జైలుకు ఆప్ నేత
నిరంకుశత్వంపై గళం విప్పినందుకే జైలుకు
ఆప్ కార్యకర్తల సమావేశంలో ఢిల్లీ సీఎం
న్యూఢిల్లీ, జూన్ 2: లిక్కర్ కుంభకోణంలో మధ్యంతర బెయిల్ గడువు ముగియటంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం తిరిగి తీహార్ జైలుకు వెళ్లారు. ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు ఆయనకు 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. బెయిల్‌ను పొడిగించాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను సుప్రీంకోర్టుతోపాటు ట్రయల్ కోర్టు కూడా తిరస్కరించటంతో ఆయన అనివార్యంగా తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జైల్లో లొంగిపోవటానికి ముందు కేజ్రీవాల్ ఆదివారం మధ్యాహ్నం మొదటి మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. అటు నుంచి హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం ఆప్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
దేశంకోసమే జైలుకు
తాను తప్పు చేసి జైలుకు వెళ్లటం లేదని, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు, ప్రజాస్వామ్య రక్షణకు పోరాటం మొదలుపెట్టినందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ‘నాకు సుప్రీంకోర్టు 21 రోజులు సమయం ఇచ్చింది. ఈ 21 రోజులు మర్చిపోలేనివి. ఈ 21 రోజుల్లో ఒక్క నిమిషం కూడా సమయాన్ని నేను వృథా చేయలేదు. దేశాన్ని రక్షించేందుకు ప్రచారం చేశారు. ఆప్ అనేది ముఖ్యం కాదు. దేశమే ముఖ్యం. నా 21 రోజుల ప్రచారంలో నాకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి మోదీకి చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం చిన్న ఆధారం కూడా లేకుండా జైల్లో పెట్టడం ముమ్మాటికీ నిరంకుశత్వమే. కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టగలం, ఎవరినైనా జైల్లో పెట్టగటం అని వాళ్లు (కేంద్ర ప్రభుత్వం) దేశానికి సందేశం ఇవ్వదలుచుకొన్నారు. వాళ్లు నన్ను ఏం చేస్తారో తెలియదు. మనం భగత్‌సింగ్ అనుచరులం. దేశాన్ని రక్షించేందుకే జైలుకు వెళ్తున్నాం. అధికారం నిరంకుశత్వంగా మారితే. జైలే జవాబుదారీ అవుతుంది’ అని పేర్కొన్నారు. ఈ సమావేశం అనంతరం ఆయన తీహార్ జైలుకు వెళ్లిపోయారు. కాగా, బెయిల్ పొడిగింపు కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల ౫వ తేదీకి వాయిదా వేసింది. ఆయనకు ౫వ తేదీవరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.






