19 May, 2026 | 12:57 AM

ప్రజావాణిలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలి

19-05-2026 12:19 AM

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్రావు

భద్రాద్రి కొత్తగూడెం, మే 18, (విజయక్రాంతి): ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్రావు ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులను జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి శ్రీరామ్తో కలిసి స్వీకరించి సమగ్రంగా పరిశీలించారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి వినతిపత్రాన్ని బాధ్యతాయుతంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. తక్షణ పరిష్కారం సాధ్యమయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మిగిలిన సమస్యలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.