మరోసారి పెట్రోల్, డీజిల్ కొరత
- బంకుల వద్ద వాహనదారుల బారులు
- కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు
- సమృద్ధిగా పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్ నిల్వలు
- సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీపెన్ రవీంద్ర
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): తెలంగాణలో వాహనదారులకు మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. ఈ ఇంధన సమస్య ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రం ఏపీలోనే ఉండగా తాజాగా రాష్ట్రంలో నూ క్షేత్రస్థాయిలో అదే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ మహానగరంతోపాటు వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత వెంటాడుతోంది. మొన్న రాత్రి నుంచి పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల్లో పెద్ద సంఖ్యలో వాహనదారులు బారులు తీరుతున్నారు. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లోనూ పెట్రోల్, డీజిల్ దొరకటం లేదు. కొన్నిచోట్ల పెట్రోల్ లభ్యత ఉండగా, మరికొన్ని చోట్ల డీజిల్ కొరత ఉంది. దీంతో పాటు కొన్ని రోజులుగా సీఎన్జీ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎన్జీ కోసం బంకుల ముందు ఆటోలు బారులు తీరుతూ తమ ఉపాధిని కోల్పోవాల్సి వస్తోంది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రాత్రి నుంచి అనేక పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడంతో బంకులు మూసివేశారు. దీం తో ఉద్యోగులు, ఇతర పనుల కోసం బయట కు వెళ్లాల్సిన వారు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో మా త్రమే ఇంధనం లభించడంతో ఆ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు.
క్యూ లో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంధన సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. వ్యవసాయ అవసరాలతో పాటు భారీ వాహనాలకు డీజిల్ ఉపయోగిస్తారు. రాబోయో రోజుల్లో పెట్రోల్, డీజిల్ దొరకదనే వదంతులతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో డబ్బాలు, డ్రమ్ముల్లో బంక్‌ల నుంచి ఇంధనం తీసుకువెళ్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది.
ఏపీలో డీజిల్ కొరత కారణంగా అక్కడి ప్రజలు తెలంగాణ బార్డర్ జిల్లాల్లోకి వచ్చి ఇంధనం కొనుగోలు చేస్తుండటంతో ఆ ప్రాంతాల్లోనూ ఇంధన సమస్య మరింతగా కనిపిస్తోంది. లారీలు, ట్రాక్టర్లు, రైతులు, వ్యాపారులు, క్రషర్ మిల్లులు, వరి కోత, మొక్కజొన్న నూర్పిడి యంత్రాల దారులు ఇబ్బందులు పడుతున్నారు. తమ వద్ద నిల్వ చేసుకున్న డీజిల్ అయిపోవడంతో వ్యవసాయ, ఆర్థిక కార్యకలాపాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అడ్వాన్స్ పేమెంట్స్ చేసినా ఇంధనం సప్లు చేయడం లేదు: అమరేందర్‌రెడ్డి
హైదరాబాద్‌లో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య లు చేశారు. కేంద్రం చెప్పినా ఆయిల్ కంపెనీలు క్రిడిట్ ఫెసిలిటీ ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ చేసినా పెట్రోల్, డీజిల్ అందడం లేదని పోర్టల్లో ట్యాంకర్ కేటాయించినా బంక్‌కు మాత్రం రావడం లేదన్నా రు. స్టాక్ పెట్టకూడదనే ఉద్దేశంతో సప్లై నిలిపేశారని చెప్పారు.
అపోహలకు గురికావద్దు : స్టీపెన్ రవీంద్ర
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాకు నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారులు ఎటువంటి అపోహలకూ గురికావద్దని సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీపెన్ రవీంద్ర తెలిపారు.
సోమవారం 7,443 కిలో లీటర్ల పెట్రోల్, 11,081 కిలో లీటర్ల డీజిల్ మొత్తం 18,524 కిలో లీటర్లకు పైగా పెట్రోల్, డీజిల్‌లను బంకుల ద్వారా వాహనదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే వినియోగదారులకు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ సరఫరా, గ్యాస్ డెలివరీలపై పౌర సరఫరాలశాఖ టోల్‌ఫ్రీ నెంబర్ 1967ను సంప్రదించాలని కోరారు.






