షేర్‌హోల్డర్లకు పెట్రో కంపెనీల బొనాంజా

10-05-2024 01:39:17 AM

హెచ్‌పీసీఎల్ 1:2 బోనస్, రూ.16.50 డివిడెండు

బీపీసీఎల్ 1:1 బోనస్, షేరుకు రూ.21 డివిడెండు

ఇరు కంపెనీలకు రిఫైనింగ్ మార్జిన్ల దెబ్బ

క్షీణించిన  ఆదాయ, లాభాలు

న్యూఢిల్లీ, మే 9: పెట్రో మార్కెటింగ్, రిఫైనింగ్ కంపెనీలు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)లు రెండూ షేర్‌హోల్డర్లకు గురువారం బొనంజా ప్రకటించాయి. హెచ్‌పీసీఎల్ ఒకవైపు 1:2 నిష్ప త్తిలో బోనస్ షేర్లను (ప్రతీ రెండు షేర్లకు ఒక షేరు బోనస్), మరోవైపు షేరుకు రూ.16.50 చొప్పున భారీ డివిడెండును ఇస్తామని తెలిపింది. అలాగే బీపీసీఎల్ డైరెక్టర్ల బోర్డు 1:1 నిష్పత్తిలో బోనస్ (ప్రతీ ఒక షేరుకు ఒక షేరు బోనస్) ఇష్యూను, షేరుకు రూ.21 చొప్పున డివిడెండును సిఫార్సుచేసింది.

హెచ్‌పీసీఎల్ లాభం రూ. 2,709 కోట్లు 

హింద్ పెట్రో  2024 మార్చి త్రైమాసికానికి బలహీనమైన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించింది. రిఫైనింగ్ మార్జిన్లు తీవ్రంగా తగ్గడంతో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం 25 శాతం క్షీణించి రూ. 2,709 కోట్ల వద్ద నిలిచింది. కన్సాలిడేటెడ్ ఆదాయం ఆరు శాతం తగ్గి రూ.1.22 లక్షల కోట్లకు చేరింది. అంతర్జాతీయ ట్రెండ్‌లో భాగంగానే తమ స్థూల రిఫైనింగ్ మార్జిన్లు తగ్గాయని హెచ్‌పీసీఎల్ తెలిపింది. నిరుడు క్యూ4లో టన్నుకు 14 డాలర్ల చొప్పున రిఫైనింగ్ మార్జిన్ సాధించిన హెచ్‌పీసీఎల్ 2024 క్యూ4లో 6.95 డాలర్లు మాత్రమే సాధించగలిగింది.

బీపీసీఎల్ లాభం రూ. 4,789 కోట్లు

భారత్ పెట్రోలియం ముగిసిన క్యూ4లో రూ. 4,789 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాది  ఇదే కాలంలో సంపా దించిన రూ. 6,870 కోట్ల లాభంతో పోలిస్తే తాజా త్రైమాసికంలో 30 శాతం క్షీణించింది. కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 1.33 లక్షల కోట్ల నుంచి రూ. 1.32 లక్షల కోట్లకు తగ్గింది.