ఈక్విటీ ఫండ్స్‌లో తగ్గిన పెట్టుబడులు

10-05-2024 01:40:41 AM

ఏప్రిల్‌లో రూ.18,917 కోట్లు

న్యూఢిల్లీ, మే 9: దేశంలోని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (యాంఫి) గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చిలో వచ్చిన రూ.22,633 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే ఏప్రిల్‌లో 16.42 శాతం క్షీణించి రూ.18,917 కోట్లకు పరిమితమయ్యాయి. లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లో తాజా అమ్మకాలు జరగడం ఇందుకు కారణమని మ్యూచువల్ ఫండ్స్ వర్గాలు తెలిపాయి.ఏప్రిల్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ మార్చికంటే ఏప్రిల్‌లో 7 శాతం పెరిగి రూ.53.12 లక్షల కోట్ల నుంచి రూ.56.99 లక్షల కోట్లకు పెరిగింది.

ఏప్రిల్‌లో 9 ఓపెన్ ఎండెడ్ న్యూ ఫండ్ ఆఫర్లు జారీకాగా, ఇవి రూ.1,532 కోట్లు సమీకరించాయి. గత నెలలో స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,208.70 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి వచ్చిన నిధులు రూ.1,793 కోట్లు. ఈ రెండు విభాగాల్లోనూ మార్చికంటే ఏప్రిల్‌లో నిధుల ప్రవాహం పెరిగింది. కానీ లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి వచ్చిన నిధులు భారీగా రూ.2,128 కోట్ల నుంచి రూ. 357 కోట్లకు తగ్గాయి. హైబ్రీడ్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు రూ. 5,583 కోట్ల నుంచి రూ. 19,862 కోట్లకు పెరిగాయి. లిక్విడ్ ఫండ్స్‌లోకి నిధుల ప్రవాహం రూ.1,02,751 కోట్లకు చేరింది. బ్యాంకింగ్, పీఎస్‌యూ ఫండ్స్ నుంచి రూ. 404 కోట్లు తరలివెళ్లాయి. 

రూ.20 వేల కోట్లు దాటిన సిప్‌లు

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (సిప్‌లు)లోకి వచ్చిన నిధులు ఏప్రిల్‌లో రూ.20,000 కోట్ల మార్క్‌ను అధిగమించాయి. ఒక నెలలో ఇంత అధికంగా సిప్ పెట్టుబడులుగా రావడం ఇదే తొలిసారి. మార్చిలో సిప్ పెట్టుబడులు రూ.19,271 కోట్లుకాగా, ఏప్రిల్‌లో ఇవి రూ.20,371 కోట్లకు చేరాయి.