5 June, 2026 | 1:50 AM

పెట్రోల్ ట్యాంకర్ బోల్తా

05-06-2026 12:48 AM

హయత్‌నగర్ పరిధిలో ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్ 

ఎల్బీనగర్, జూన్ 4 (విజయక్రాంతి): హయత్‌నగర్ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెం దగ్గర పెట్రోల్ లోడ్‌తో హైదరాబాద్‌కు వెళ్తున్న ట్యాంకర్ వాహనం ముందుగా ఉన్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముందుగా ఉన్న రెండు కార్లు ధ్వంసమయ్యాయి. కారులో ఉన్నవారికి గాయాలు కాగా, ప్రాణనష్టం వాటిల్లలేదు. అగ్నిమాపక, డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ సిబ్బంది తక్షణమే స్పందించి ధ్వంసమైన  వాహనాలను తొలిగించారు.

ప్రమాదం సమయంలో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హయత్‌నగర్ సీఐ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ.. సాయంత్రం 5.30 గంటలకు లక్ష్మారెడ్డి పాలెం వద్ద జాతీయ రహదారిపై మల్లాపూర్ నుంచి లక్డీకాపూల్‌కు వెళుతున్న ఐవోసీకి చెందిన పెట్రోల్ ట్యాంకరు బోల్తాపడిందన్నారు. ముందున్న వాహనాన్ని తప్పించబోయి ఈ ప్రమాదం జరిగిందన్నారు. దీంతో ఒక కారు ను ఢీకొట్టి బోల్తా పడిందన్నారు. ట్యాంకర్ డ్రైవర్, కారు డ్రైవర్, ఇతర వ్యక్తులకు గాయాలయ్యాయని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఐవోసీ సిబ్బంది ట్యాంకర్‌ను రహదారిపై నుంచి పక్కకు తీశామని సీఐ వివరించారు.