27 April, 2026 | 4:03 AM

ఫొటోజర్నలిస్ట్ రఘురాయ్ కన్ను మూత

27-04-2026 02:14 AM
  1. రెండేళ్ల నుంచి క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస
  2. ఫొటోగ్రఫీ రంగంలో ఆరు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం
  3. ఎమర్జెన్సీ నుంచి భోపాల్ గ్యాస్ లీక్ ఘటనలకు ప్రత్యక్ష సాక్షి
  4. 18 పుస్తకాల రచన.. వందలాది ఫొటోగ్రఫీ ప్రదర్శనలు
  5. ఆయన సేవలకు వరించిన పద్మశ్రీ.. మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు
  6. రాయ్‌కి తెలంగాణ ఫొటో జర్నలిస్టుల సంఘం నివాళి

న్యూఢిల్లీ/ హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ కన్నుమూశారు. దశాబ్దాల పాటు ఎన్నో చారిత్రక ఘట్టాలను, విషాదాలను, విజయాలను ప్రపంచానికి పరిచయం చేసిన ‘భారత ఫొటో జర్నలిజం పితామహుడు’ రఘు రాయ్(83) ఆదివారం తుదిశ్వాస విడిచారు. రఘు రాయ్ రెండేళ్ల పాటు క్యాన్స ర్‌తో పోరాడి మరణించారు. ఆయన మరణవార్తను కుటుంబ సభ్యులు అధికారిక సో షల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు.

రెండు సంవత్సరాల క్రితం తన తండ్రి కి మొదట ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, అయితే ఆయన దాని నుం చి కోలుకున్నారని రాయ్ కుమారుడు తెలిపారు. ఆ తర్వాత, ఆయన మళ్లీ క్యాన్సర్ బా రిన పడగా మళ్లీ చికిత్స అందించామన్నారు. అయితే ఇటీవల ఆ క్యాన్సర్ ఆయన మెదడుకు వ్యాపించిందని, వయసు సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయని, దీంతో రఘురాయ్ మృతిచెందారని ఆయన కుమారుడు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని లోధి రోడ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం నివాళులు అర్పించింది.

అయి తే రఘురాయ్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. సామాన్యులతోపాటు మదర్ థెరిసా, దలైలామా, ఇందిరా గాంధీ, శివసేన వ్యవస్థాపకులు బాల్ థాక్రే, ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే వంటి ఎందరో ప్రముఖుల ఫొటోలను తన కెమెరాలో బంధించారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో ఆయన తీసిన ఛాయాచిత్రాలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. సగం పూడ్చిపెట్టిన ఒక చిన్నారి కళ్లలోని విషాదాన్ని ఆయన బంధించిన తీరు, ఆ దుర్ఘటన తీవ్రతను కళ్లకు కట్టింది. 1942, డిసెంబర్ 18న పంజాబ్‌ని ఝంగ్ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) జన్మించిన రఘురాయ్ తన 23వ ఏట కెమెరా చేతపట్టారు. ఆయన 1960వ దశకం మధ్యలో తన వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత, ఆయన ‘ది స్టేట్స్‌మాన్’ పత్రికలో స్టాఫ్ ఫొటోగ్రాఫర్‌గా చేరారు.

1976లోనే ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా ప్రయాణం

1976లో, ఆయన వార్తాపత్రికను విడిచిపెట్టి, ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా స్వతంత్రంగా పనిచేయడం ప్రారంభించారు. 1982 నుంచి 1992 వరకు, ఆయన ఇండియా టుడేలో డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా పనిచేశారు. 1990 నుంచి 1997 మధ్యకాలంలో, ఆయన వరల్డ్ ప్రెస్ ఫొటోకు జ్యూరీ సభ్యుడిగా కూడా సేవలందించారు. ఆయన తన ఫొటోగ్రఫీ పుస్త కాలకు కూడా ప్రసిద్ధి చెందారు. అతని అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని రచనలలో ‘రఘు రాయ్స్ ఇండియా: రిఫ్లెక్షన్స్ ఇన్ కలర్’, ’రిఫ్లెక్షన్స్ ఇన్ బ్లాక్ అండ్ వైట్’ ఉన్నాయి. 18కి పైగా పుస్తకాలు రచించిన ఆ యన, వరల్డ్ ప్రెస్ ఫొటో పోటీలకు మూడుసార్లు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

రాయ్ పనితీరుకు ముగ్ధుడైన హెన్నీ కార్టియర్ బ్రెసన్

ఆయనకు ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ హెన్రీ కార్టియర్ -బ్రెసన్ గురువుగా ఉన్నారు. రాయ్ పనితీరుకు ఎంతగానో ముగ్ధుడైన ఆయన, 1977లో మాగ్నమ్ ఫొటోస్‌లో చేరమని కార్టియర్-బ్రెసన్ సిఫార్సు చేశారు. మాగ్నమ్ ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఫొటోగ్రఫీ సంస్థలలో ఒకటి. కేవలం అగ్రశ్రేణి ఫొటోగ్రాఫర్లను మాత్రమే ఇందులో సభ్యులుగా ఆహ్వానిస్తారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫొటోజర్నలిజం’గా గుర్తింపు పొందారు.

బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో తన తీసిని ఫొటోగ్రఫీకి గాను, 1972లో రఘురాయ్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 1992లో, అమెరికా లో ఆయన ‘సంవత్సరపు ఉత్తమ ఛాయాగ్రాహకుడి’గా ఎంపికయ్యారు. 2019లో, ఛాయాగ్రహణ రంగంలో అత్యున్నత అంతర్జాతీయ పురస్కారాలలో ఒకటైన ‘అకాడెమీ డెస్ బ్యూక్స్-ఆర్ట్స్ ఫొటోగ్రఫీ’ అవార్డును ఆయన గెలుచుకున్నారు. అలాగే, 2017లో భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆయనకు ‘జీవన సాఫల్య పురస్కారాన్ని’ ప్రదానం చేసింది. 

ఛాయాచిత్ర రంగానికి తీరని లోటు: టీజీపీజేఏ

ఛాయాచిత్ర రంగానికి ఒక సముచితమైన స్థానం కల్పించి పద్మశ్రీ అవార్డును పొందిన రఘురాయ్.. ఒక విలక్షణమైన ఫొటోగ్రాఫర్‌గా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ల సరసన చేరారని తెలిపింది. ఆయన మరణ వార్త ఫొటోగ్రఫీ రంగానికి తీర్చలేని లోటని, పూడ్చలేని అగాధంగా తెలంగాణ ఫొటో జర్నలిస్ట్స్ అసోసి యేషన్(టీజీపీజేఏ) పేర్కొంది.

తన కెమెరా ద్వారా సమాజాన్ని ప్రతిబింబిస్తూ, భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిన ఆయన సేవలు చిరస్మరణీయమని టీజీపీజేఏ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు జీ భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న యాదగిరిగౌడ్ తెలిపారు. తెలంగాణ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ తరఫున రఘురాయ్ మృతికి ప్రగా ఢ సంతాపం వ్యక్తం చేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ మేరకు వారు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.