శాతవాహనలో వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షలు
యువత క్రీడా నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి - ఆచార్య ఉమేష్
ముకరంపుర,జూన్1(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న వ్యాయామ విద్య-2026 ప్రవేశ పరీక్షలను రెండవ రోజు విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. మొదటిరోజు పరీక్షలు చాలా కట్టుదిట్టంగా నిర్వహించామని వ్యాయామ విద్య పరీక్షలకు ఉన్న డిమాండ్ అనుసరించి కళాశాలలో సీట్లు పెరగాలని వి సి అన్నారు.
అభ్యర్థులు శారీరక నైపుణ్య పరీక్షలో తమ యొక్క ప్రతిభను చూపాలని దానితో వారికి మెరుగైన మార్కులతో మంచి కళాశాలలో సీటు లభించే అవకాశం కలుగుతుందన్నారు. ప్రస్తుతం పరిమితమైన సీట్లు ఉన్నాయని దాంతో పోటీలలో అభ్యర్థులు తమ శక్తిమేరకు ప్రయత్నం చేసి శారీరక దృఢత్వ పరీక్ష, నైపుణ్య అభివృద్ధి పరీక్షలలో ప్రతిభ చాటుతూ తెలంగాణ పిఈసెట్ 2026కి అర్హత సాధించాలని కోరారు.
విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్,వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షల కన్వీనర్ ఆచార్య రాజేష్ కుమార్ మాట్లాడుతూ వ్యాయామ విద్యలో 712 దరఖాస్తు చేసుకోగా అందులో 531 మంది ప్రవేశ పరీక్షలో పాల్గొనగా 181 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని అలాగే డిప్లమా వ్యాయామ విద్యలో 285 మంది దరఖాస్తు చేసుకోగా 190 మంది పరీక్షలకు హాజరవుగా 95 మంది గైర్హాజరయ్యారని శారీరిక సామర్ధ్య పరీక్షల్లో భాగంగా పురుషుల విద్యార్థులకు 100 మీటర్లు, 800 మీటర్ల పరుగు, షాట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్ పోటీలు నిర్వహించామని శరీర నైపుణ్య పరీక్షలకు సంబంధించి ఫుట్ బాల్ , వాలీబాల్, ఖో ఖో, క్రికెట్, కబడ్డీ పరీక్షలు నిర్వహించి నైపుణ్య పరీక్షలను పూర్తి చేశారని తెలిపారు.






