అది జూఠ్ కీ గూంజ్
- కాంగ్రెస్ ఛాత్రోన్ కీ గూంజ్’పై ప్రధాని మోదీ విమర్శలు
- గత 10 ఏళ్లలో యూపీఏ 50 వేల మరుగుదొడ్లనూ కట్టలేదు
- మేము 50వేల రైలు కోచ్‌లను నిర్మించాం
- ‘నారాజ్ ఫుఫా జీ’కి మళ్లీ పనిదొరికిందని మోదీ ఎగతాళి
వడోదర/ముంబై, సెప్టెంబర్ 8: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi) చేపట్టిన ‘ఛాత్రోన్ కీ గూంజ్’ (విద్యార్థుల గర్జన) కార్యక్రమంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విమర్శలు గుప్పించారు. అది ఒక ‘జూఠ్ కీ గూంజ్’ (అబద్ధాల ఉద్యమం) అని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రతి చోటా తప్పుదోవ పట్టించే వ్యక్తులు ఉండనే ఉంటారు. ఎప్పుడూ అసంతృప్తిగా ఉండే మామయ్య కేంద్రంపై విమర్శలు చేస్తుంటారని, కానీ నేటి యువత వారి ప్రచారం వల్ల తప్పుదోవ పట్టదని, వారి మాయలో ఎట్టిపరిస్థితుల్లో పడబోరని స్పష్టం చేశారు.
యువతరం ఎప్పటికైనా సత్యం వైపే నిలబడుతుందని అన్నారు. యువత ఏఐలో నిపుణులు కావాలని ఆకాంక్షించారు. 10 ఏళ్లలో యూపీఏ ప్రభుత్వం 50వేల మరుగుదొడ్లను కూడా నిర్మించలేదని, బీజేపీ ప్రభుత్వం హయాంలో 50వేల రైలు కోచ్‌లను తాము నిర్మించామని మోదీ విమర్శించారు. గుజరాత్‌లో ప్రధాని మోదీ రూ.35,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు మంగళవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కేంద్రప్రభుత్వాన్ని, అభివృద్ధిని ప్రశ్నించే వారిని ఉద్దేశిస్తూ, ప్రతిపక్షంపై తన దాడిని తీవ్రతరం చేస్తూ, ప్రధాని మోదీ ‘నారాజ్ ఫుఫా జీ’ (ఎప్పుడూ అసంతృప్తిగా ఉండే మామయ్య) అనే వ్యాఖ్యను మరోసారి ఉపయోగించారు. గుజరాత్‌లోని వడోదరలో జరిగిన ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో జెన్ (యువత)తో ముఖాముఖి నిర్వహించిన సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన రూ.35,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో 2,800 కిలోమీటర్ల ప్రత్యేక రైలు సరుకు రవాణా కారిడార్ కూడా ఉంది. దీనిని ఆయన 21వ శతాబ్దపు చారిత్రక విజయంగా అభివర్ణించారు. యూపీఏ ప్రభుత్వంతో తన ప్రభుత్వ పనితీరును పోల్చడానికి, తయారీ రంగంలో స్వావలంబనను స్పష్టంగా చెప్పడానికి ఆయన ప్రత్యేక సరుకు రవాణా కారిడార్‌ను ఉపయోగించుకున్నారు.
‘ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టును 2004లో ప్రతిపాదించినప్పటికీ, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చేవరకు ఏమీ ముందుకు సాగలేదు,‘ అని ఆయన అన్నారు. ఎవరి పేరు ప్రస్తావించకుండా, ప్రధానమంత్రి ఆ ప్రాజెక్టు ప్రయోజనాన్ని ప్రశ్నించే వ్యతిరేకులను ఎగతాళి చేశారు. ‘ఏదో ఒక నారాజ్ ఫుఫా జీ ‘ట్రక్ డ్రైవర్లు ఏం చేస్తారు?’ అని అరుస్తుంటారు. ఇప్పుడు అంకుల్ జీకి పని దొరికిందని ఆయన చమత్కరించారు.
గత యూపీఏ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేస్తూ ప్రధాని మోదీ, 2014 తర్వాత భారతదేశం 50,000 ఆధునిక రైల్వే కోచ్‌లను నిర్మించిందని, గత ప్రభుత్వం 10 ఏళ్లలో 50,000 టాయిలెట్లను కూడా నిర్మించలేకపోయిందని అన్నారు. విడిభాగాలు, తుది ఉత్పత్తులు రెండూ దేశీయంగానే తయారవుతూ, భారత్ ఇప్పుడు ‘చిప్స్ నుంచి ఓడల వరకు’ అనే కొత్త తయారీ యుగంలోకి ప్రవేశిస్తోందని పేర్కొన్నారు. దేశంలో ‘ప్రతిచోటా మిమ్మల్ని ‘జూఠ్ కీ గూంజ్’ ద్వారా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించే వ్యక్తులు కనిపిస్తారు.
కానీ నేటి యువత సత్యం వైపే నిలబడుతుంది’ అని ప్రధాని స్పష్టం చేశారు. ‘ఛాత్రోన్ కీ గూంజ్’ అనేది కాంగ్రెస్ ప్రారంభించిన అబద్ధాల ఉద్యమం అని విమర్శించారు. సౌర, పవన, జల, అణు శక్తి వంటి రంగాల్లో తమ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో నేటి యువత గమనించగలదని ప్రధాని పేర్కొన్నారు. నేటి యువత కాంగ్రెస్ నిర్వహించే అబద్ధాల ఉద్యమంలో ఎట్టిపరిస్థితుల్లో భాగం కారని తెలిపారు.