04-05-2024 12:48:58 AM
కొవిడ్ టీకా సర్టిఫికెట్లపై ప్రధాని చిత్రం తొలగింపు
వ్యాక్సిన్ దుష్ప్రభావాలు బయటికి రావడమే కారణం
పాటలీపుత్ర ఆర్‌జేడీ ఎంపీ అభ్యర్థి మీసా భారతి
పాట్నా, మే 3: కొవిషీల్డ్ టీకాకు సంబంధించి ప్రధాని నరేంద్రమోదీపై ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కూతురు, పాటలీపుత్ర ఎంపీ అభ్యర్థి మీసా భారతి విమర్శలు చేశారు. కొవిషీల్డ్ ఫలితాలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే టీకా సర్టిఫికెట్లపై మోదీ ఫొటోలను తొలగించారని ఆరోపించారు. బీహార్‌లోని దానాపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏ పనిచేసినా దాని క్రెడిట్ తీసుకోవడం మన ప్రధానికి అలవాటు. ఇప్పుడు కొవిడ్ వ్యాక్సిన్‌పై దుష్ప్రభావాల ఫలితాలు బయటికి వస్తున్నాయి. దీంతో పరువు పోతుందనే భయంతో వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ఆయన ఫొటోను తొలగించారుఅని ఆరోపించారు.
దర్యాప్తునకు డిమాండ్..
కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రతిస్థాయిలో దర్యాప్తు జరగాలని, ఈ విచారణ ఎందుకో ప్రజలకందరికీ ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాకూటమి అవగాహన కల్పిస్తున్నా మని మీసా భారతి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే, ఎన్నికల నియమావళి కారణంగా కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై మోదీ ఫొటోను తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. 2022లో గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా మోదీ చిత్రాన్ని టీకా ధ్రువపత్రాలపై తొలగించారు. కాగా, రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గే టీటీఎస్ అనే అరుదైన వ్యాధికి కోవిషీల్డ్ టీకా కారణమవుతుందని ఇటీవల దాని తయారీ సంస్థ ఆస్ట్రాజెనికా.. బ్రిటన్ కోర్టులో అంగీకరించింది. దీన్ని భారత్‌లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ దీన్ని తయారు చేయగా దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించారు.