20-05-2025 11:22:27 AM
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటన: ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ
హైదరాబాద్: ఈనెల 18 వ తేదీన చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం(Gulzar house Fire breaks out) పై సమగ్ర విచారణ చేపట్టాలని ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తెలిపారు. కమిటీ లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్,హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి,హైదరాబాద్ సీపీ సివి ఆనంద్ , ఫైర్ డీజీ నాగిరెడ్డి , హైడ్రా కమిషనర్ రంగనాథ్ ,టీఎస్ఎస్పీడీసీఎల్(Telangana State Southern Power Distribution Company Limited) సిఎండి ముషారఫ్ ఉన్నారు.
గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదంపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి ఘటనకు గల కారణాలు ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలు పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)కి సమగ్ర నివేదిక ఇస్తారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అలాగే భవిష్యత్ లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయి ప్రజలకు సూచనలు స్థానిక పరిస్థితులు అంచనా వేసి భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు ప్రతిపాదనలతో సూచనలు చేస్తూ ప్రతిపాదనలు చేయాలన్నారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు సమీక్ష చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్లు రాక బాధితులకు ఆక్సిజన్ అందలేదనే కొంత మంది చేస్తున్న వ్యాఖ్యలను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Hyderabad In-charge Minister Ponnam Prabhakar) ఖండించారు. మే 18న గుల్జర్ హౌస్ లో అగ్ని ప్రమాదమునకు గురైన 15 మంది బాధితులను 7అంబులెన్సులు108 వాహనములలో సమీప ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తక్షణమే తరలించి ఆక్సిజన్ అందిస్తూ సహాయక చర్యలు అందించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రమాద సమాచారమును 108 జిల్లా కోఆర్డినేటర్ భూమా నాగేందర్ కు తెలియజేయడం జరిగిందన్నారు. ప్రమాదమునకు సంబంధించిన సమాచారము ఉదయం 6.17 నిమిషాలకు 108 కాల్ సెంటర్ కు అందిన వెంటనే గోషామహల్ 108 అంబులెన్స్ టీఎస్ 08 యుఎల్ 5682 వాహనము సిబ్బందితో ఉదయం 6.25 నిమిషాలకు(8 నిమిషాలలో) ప్రమాద స్థలమునకు చేరి సహాయ చర్యలు అందించామని తెలిపారు.