2 April, 2026 | 3:21 AM

ధరలు పెంచబోం

02-04-2026 12:20 AM
  1. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ సరఫరాను పెంచాలి
  2. వివిధ దేశాలతో కొనుగోలుపై దృష్టిసారించాలి
  3. వేసవిలో విద్యుత్ కొరత రావొద్దు
  4. పశ్చిమాసియా పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగినా, దాని ప్రభావం దేశం మీద పడుతున్నా, భారత్‌లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ గ్యాస్ ధరలను పెంచబోమని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలో భద్రతా వ్యవహారాల కేబినెట్ (సీసీఎస్) సమావేశం జరిగింది.

ఈ భేటీలో ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొన్నారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇంధన సరఫరాలు, ఎరువుల లభ్యత, భారతీయుల భద్రత, విద్యుత్ డిమాండ్, నిత్యావసరాల లభ్యత వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. ఫిబ్రవరి 28న అమెరికా- ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్‌లో యుద్ధం ప్రారంభమైంది.

అప్పటి నుంచి పశ్చిమ ఆసియా ప్రాంతంలో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మూడోసారి సీసీఎస్ సమావేశాన్ని బుధవారం నిర్వహించింది. గత సమావేశాల్లో అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన సరఫరాలపై తీసుకున్న చర్యలను సమీక్షించారు. ప్రభుత్వం తెలిపిన ప్రకారం.. దేశానికి ప్రస్తుతం 60 రోజుల క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయని, మొత్తం నిల్వ సామర్థ్యం 74 రోజులకు సరిపోతుందని, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి పెరుగుదల ఉండదని, ఎల్పీజీ ధరలు కూడా పెంచబోమని తెలిపింది.

ఈ ఏడాది ఖరీఫ్ కోసం తగినంత విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. వ్యవసాయ ఇన్‌పుట్స్‌లో ఎటువంటి కొరత లేదని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ధరలు పెరిగినా, దేశీయ విమాన ప్రయాణ ఖర్చులు పెరగకుండా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతం నుంచి ఇప్పటివరకు 5.98 లక్షల మంది భారతీయులు తిరిగి వచ్చారని, ప్రస్తుతం 485 మంది భారతీయ నావికులు పర్షియన్ గల్ఫ్‌లో ఉన్నారని, వారందరూ సురక్షితంగా ఉన్నారని ఓడరేవులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

గల్ఫ్ ప్రాంతంలో చదువుతున్న భారతీయ విద్యార్థుల విద్యా సంవత్సరం అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వివిధ దేశాల నుంచి కొత్తగా వస్తున్న సరఫరాలతో ఎల్పీజీ, ఎల్‌ఎన్జీ వనరులను విస్తరిస్తున్నామని, అయితే దేశీయ ఎల్పీజీ ధరలు యథాతథంగా ఉన్నాయని అధికారులు వివరించారు. నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి  చర్యలు కూడా చేపడుతున్నామని తెలిపారు.

రాబోయే నెలల్లో విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి తగినంత బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయని, అదే సమయంలో గ్యాస్ ఆధారిత ప్లాంట్లకు నిబంధనలను సడలించడం, థర్మల్ స్టేషన్లకు బొగ్గు సరఫరాను పెంచడం వంటి చర్యలు తీసుకున్నారు. ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి వ్యవసాయం, ఎరువులు, షిప్పింగ్, విమానయానం, లాజిస్టిక్స్, ఎంఎస్‌ఎంఈ రంగాలలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. నిత్యావసర వస్తువుల పర్యవేక్షణ, రాష్ట్రాలతో సమన్వయం కోసం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

గత నెల రోజులుగా నిత్యావసర ఆహార పదార్థాల ధరలు పెరగకుండా, స్థిరంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పౌరులకు కీలక నిత్యావసరాల లభ్యతపై కూడా ప్రధాని మోదీ సమీక్షించారు. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తప్పుడు సమాచారాన్ని నివారించాలని స్పష్టం చేశారు. మారుతున్న ప్రపంచ పరిస్థితుల వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.